: ట్రేడర్ల బెట్టింగ్ తో మరింతగా పెరగనున్న బంగారం, వెండి ధరలు!

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ట్రేడర్లు బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో పాటు ముడిచమురు లావాదేవీల్లో చురుకుగా పాల్గొంటుండటంతో, ధరలు మరింతగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు వారాల వ్యవధిలో బంగారం ధర ఏకంగా రూ. 1000కి పైగా పెరగడానికి ట్రేడర్లు బుల్లిష్ ధోరణే కారణమని తెలుస్తోంది. గత నెల 18వ తేదీన రూ. 28,983 వద్ద ఉన్న పది గ్రాముల బంగారం ధర 29వ తేదీ నాటికి రూ. 29,950కి పెరిగింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 38,322 నుంచి రూ. 41,535కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో సైతం బంగారం, వెండి కొనుగోళ్లకు మద్దతు పెరుగుతోంది. గడచిన ఏడాది వ్యవధిలో బంగారం ధర 20 శాతం పెరుగగా, వెండి ధర 25 శాతం, బ్రెంట్ క్రూడాయిల్ ధర 31 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఏడాదిన్నరలో గరిష్ఠస్థాయిలో ఉన్న స్వచ్ఛమైన బంగారం ధర సమీప భవిష్యత్తులో మరింతగా పెరగవచ్చని జెమ్స్ అండ్ జ్యూయెలరీ ట్రేడ్ ఫెడరేషన్ డైరెక్టర్ బచ్చారాజ్ బామాల్వా అంచనా వేశారు. ప్రజలు అక్షయ తృతీయ కోసం ఎదురు చూస్తున్నారని, ధరలు పెరిగినప్పటికీ, బంగారం కొనుగోలుకు అత్యంత శుభ ఘడియలుగా భావించే పర్వదినం నాడు రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు కావచ్చని తెలిపారు. గత సంవత్సరం అక్షయ తృతీయతో పోలిస్తే విలువైన లోహాల ధరలు 20 నుంచి 25 శాతం పెరిగాయని, ఇదే ప్రజల సెంటిమెంట్ ను నిలుపుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News