: దాదాపు నెలన్నర తరువాత తగ్గుముఖం పట్టిన ముడిచమురు ధరలు!

పూర్తి స్థాయిలో ముడిచమురును ఉత్పత్తి చేయనున్నామని, చమురు క్షేత్రాలను మరింతగా అభివృద్ధి చేయనున్నామని సౌదీ అరేబియా చేసిన ప్రకటన క్రూడాయిల్ మార్కెట్ ను కుదేలు చేసింది. దీంతో దాదాపు నెలన్నర రోజులుగా పెరుగుతూ వస్తున్న ముడి చమురు ధర భారీగా తగ్గింది. నేటి ఆసియా మార్కెట్లో ముడి చమురు ధర బ్యారల్ కు 1.39 శాతం పడిపోయి 43.12 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.11 శాతం తగ్గి 44.61 డాలర్లకు చేరింది. షాబే చమురు క్షేత్రంలో పనులు మే నాటికి పూర్తవుతాయని, ఇక్కడి నుంచి రోజుకు 12 మిలియన్ బ్యారళ్ల ముడిచమురును వెలికితీసి మార్కెట్లోకి పంపుతామని సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ ప్రకటించినట్టు బ్లూమ్ బర్గ్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికితోడు షాబే క్షేత్రం విస్తరణ, అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం వెలికితీస్తున్న 1.5 లక్షల బ్యారళ్లను 10 లక్షలకు పెంచుతున్నట్టు కూడా వార్తలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించిందని నిపుణులు వ్యాఖ్యానించారు . కాగా, భారత క్రూడ్ బాస్కెట్ (మే 19 డెలివరీ) బ్యారల్ కు క్రితం ముగింపుతో పోలిస్తే 27 రూపాయలు తగ్గి 0.92 శాతం నష్టపోయి రూ. 2,909 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్ మార్కెట్ నష్టాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపైనా కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో హ్యాంగ్ సెంగ్ 0.42 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.82 శాతం, నిక్కీ 0.76 శాతం నష్టపోగా, ఉదయం 12:15 గంటల సమయంలో బీఎస్ఈ సూచిక 0.53 శాతం, నిఫ్టీ సూచిక 0.57 శాతం నష్టాల్లో సాగుతున్నాయి.

More Telugu News