: తిరిగిరాని రుణాలిచ్చీ లాభపడుతున్న ఐసీఐసీఐ, ఎస్బీఐ!

కార్పొరేట్ సంస్థలకు భారీగా రుణాలిచ్చి, ఆపై వాటిని సకాలంలో వసూలు చేయడంలో విఫలమై, రుణాలను నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తున్నట్టు ప్రకటించి కుదేలైన బ్యాంకులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. డీఫాల్ట్ రిస్క్ లో ఉన్నాయని బ్యాంకులు వెలువరించిన జాబితాను పరిశీలించిన ఆర్బీఐ, పలు సంస్థల పేర్లను తొలగిస్తున్నట్టు తెలిపింది. మొత్తం 150 కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు లేవని బ్యాంకులు వెల్లడించగా, వాటిల్లో నుంచి 20 కంపెనీల పేర్లను తొలగించింది. ఈ సంస్థలకు కనిపించే ఆస్తులు ఉన్నందున రుణాలు వసూలు చేయవచ్చని తెలిపింది. ఈ కంపెనీల్లో జైప్రకాష్ అసోసియేట్స్ (జేపీ అసోసియేట్స్), కోస్టల్ ఎనర్జెన్, జీఎంఆర్, జీవీకే వంటి పేర్లు ఉండటంతో వీటికి రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ ఎస్బీఐ, ప్రైవేటు రంగ ఐసీఐసీఐ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ ప్రకటనతో, ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్లో బ్యాంకుల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు కనిపించింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 4 శాతం పెరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితరాలు 4 నుంచి 6.5 శాతం లాభపడ్డాయి. ఆర్బీఐ చర్యలతో బ్యాంకులపై ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్) ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, తిరిగి వసూలు చేసుకోలేని రుణాలిచ్చిన బ్యాంకులు, ఇప్పుడు ఆయా సంస్థల ఆస్తుల వివరాలు సేకరించే పనిలో పడగా, ఈక్విటీలకు కొనుగోలు మద్దతుతో మార్కెట్లో విలువ పెరుగుతున్న పరిస్థితి నెలకొంది.

More Telugu News