: రూ. 15 వేల కోట్ల కోసం ఇన్వెస్టర్ల ముందు 31 కంపెనీల క్యూ!

వ్యాపార విస్తరణ, మూలధన నిల్వలు, రుణాలను తిరిగి చెల్లించే లక్ష్యాలతో వచ్చే రెండు నెలల వ్యవధిలో 31 కంపెనీలు దాదాపు రూ. 15 వేల కోట్లకు పైగా మార్కెట్ల నుంచి సమీకరించే దిశగా, వాటాల విక్రయానికి రానున్నాయి. ఇటీవలి కాలంలో ఐపీఓలు విజయవంతం కావడం, మార్కెట్ల సానుకూల ఫలితాలు, ఈ కంపెనీలకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, స్టాక్ మార్కెట్లలో ఐపీఓల హడావుడి పెరిగింది. దిలీప్ బిల్డ్ కాన్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్వెస్ కార్ప్, హిందుజా లేలాండ్ ఫైనాన్స్, సీవేస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ తదితర కంపెనీల ఐపీఓలు మార్కెట్ ను తాకనున్నాయి. ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి 25 కంపెనీలు అనుమతి పొందివున్నాయి. ఈ కంపెనీలు రూ. 12,500 కోట్లను సమీకరించే యోచనలో ఉండగా, మరో ఆరు కంపెనీలు రూ. 3 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా దరఖాస్తులు చేసి అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. మరెన్నో సంస్థలు సమీప భవిష్యత్తులో దరఖాస్తు చేసే అలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,461 కోట్ల మొత్తం ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించిన సంగతి తెలిసిందే. 2014-15లో ఐపీఓల ద్వారా సమీకరించబడ్డ రూ. 2,770 కోట్లతో పోలిస్తే, ఇది దాదాపు ఐదు రెట్లు అధికం. ప్రస్తుతం ఐపీఓల ద్వారా వాటాలను విక్రయించాలని భావిస్తున్న సంస్థల్లో చిన్న, మధ్యతరహా స్థాయి కంపెనీలే అధికంగా ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News