: అనంత్ అంబానీలా మార్పును కోరుతున్నారా? అయితే, ఇలా చేయండి!

స్థూలకాయం... ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ సమస్యను ఎంతో సులువుగా అధిగమించాడు. కేవలం 18 నెలల కాలంలో 108 కిలోల బరువును తగ్గించుకున్నాడు. స్థూలకాయంతో బాధపడుతున్న వేలాది మంది యువతకు అనంత్ ఇప్పుడు ఆదర్శనీయుడయ్యాడు. ఆత్మన్యూనతతో బాధపడుతూ అతనిలా బరువు తగ్గాలని భావిస్తున్న వారెందరో ఉన్నారు. వారికోసం కొన్ని టిప్స్... * లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి: ఉండాల్సిన బరువెంత? మీరెంత బరువు ఉన్నారు? ఎంత తగ్గాలని అనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ముందుగా తెలుసుకోవాలి. దీంతో పాటు వయసు కూడా ముఖ్యమే. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) సంతృప్తికర స్థాయికి రావాలంటే ఎంత బరువు తగ్గాలన్న విషయమై ఓ గోల్ నిర్దేశించుకోవడం మొదట చేయాల్సిన పని. * ఎలా చేయాలి? తగ్గాల్సిన బరువును బట్టి ఎక్సర్ సైజులు, యోగాలను ఓ క్రమానుసారం చేస్తూ వెళ్లాలి. అనంత్ రోజుకు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేశాడు. రోజుకు 21 కిలోమీటర్లు నడిచేవాడు. యోగా చేశాడు. బరువు తగ్గాలంటే ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిది. దీని వల్ల గుండెపై సైతం అధిక ఒత్తిడి పడదన్నది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. దీనికితోడు ఓ సరైన శిక్షకుడి సలహాలూ అవసరం. లేకుంటే చేస్తున్న ఎక్సర్ సైజ్ ప్రమాదాలకు కూడా దారితీయవచ్చు. * కుటుంబ సభ్యుల సహకారం మీరు చేస్తున్న పని మీ జీవితాన్ని మార్చి వేసేస్తుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అవసరం. ఈ విషయంలో తల్లి నీతా అంబానీ నుంచి అనంత్ కు పూర్తి సహకారం అందింది. "ఓ తల్లి ఏం చేస్తుందో పిల్లలూ అదే చేయాలని అనుకుంటారు. నా కొడుకును పస్తులతో ఉంచి నేను తినలేకపోయాను. అనంత్ ఏది తింటుంటే, నేనూ అదే తిన్నాను. అతను నడుస్తుంటే, కొంత ఉత్సాహాన్ని ఇచ్చేందుకు నేనూ నడిచాను" అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. * తక్కువ మొత్తాలుగా ఎక్కువ సార్లు తినాలి తినే ఆహారం తక్కువ మొత్తంగా ఉండాలి. రోజులో ఎక్కువసార్లు తినాలి. తక్కువ కార్బోహైడ్రేడ్లు, షుగర్ ఉంటూ, శరీరానికి చాలినంత కొవ్వు, ప్రొటీన్లను అందించే ఆహారం తీసుకోవాలి. ఏదైనా తినవచ్చుగానీ, మోతాదు మాత్రం మించకూడదు. * ట్రాక్ చెక్ కోసం టెక్నాలజీ ఏ రోజు ఏం చేశామన్నది ట్రాక్ చేసుకునేందుకు టెక్నాలజీని వాడుకోవాలి. రోజుకు ఎన్ని అడుగులు వేశాం? ఎంత దూరం పరిగెత్తాం? ఏం తింటే, ఎంత శక్తి వచ్చింది? ఏ పనికి ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? వంటి విషయాలను స్మార్ట్ ఫోన్ యాప్స్ సహాయంతో నిత్యమూ ట్రాక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వీటి ద్వారా, సులువుగా లక్ష్యం ఎంత దూరంలో ఉందన్న విషయం సులువుగా తెలుస్తూ ఉంటుంది.

More Telugu News