: గుడ్డి ప్రపంచంలో ఒంటికన్నుతో ఉన్న ఇండియానే రాజు: రఘురాం రాజన్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇండియా మెరుస్తున్న నక్షత్రంలా కనిపిస్తూ, పెట్టుబడిదారులకు స్వర్గధామంలా కనిపిస్తున్న వేళ, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడ్డి ప్రపంచంలో ఒంటికన్నుతో ఉన్న ఇండియానే రాజని అన్నారు. జీ 20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశాల కోసం యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన వాల్ స్ట్రీట్ డిజిటల్ నెట్ వర్క్ ప్రచురించే 'మార్కెట్ వాచ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ, ఐఎంఎఫ్ సహా పలు దేశాలు ఇండియా మెరుగైన అవకాశాలను అందిస్తోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. "ప్రపంచ ఇన్వెస్టర్లకు ఇండియా సంతృప్తికర అవకాశాలను దగ్గర చేసేలా కనిపిస్తోంది. అయితే, గుడ్డి ప్రపంచంలో ఒంటికన్నున్న వాడే రాజన్న విధంగా ఇండియా ఉంది" అని అన్నారు. ఇండియాలో సమీప భవిష్యత్తులో మంచి వృద్ధి రేటు నమోదు కానుందని, అయితే, అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా నిలిచేందుకు మరెంతో సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా ఏ ఘటన జరిగినా, భారత్ పై ప్రభావం పడబోదని తాను చెప్పబోనని, ఇదే సమయంలో ఎక్కువ ఘటనల నుంచి ఇండియా సురక్షితంగా తప్పించుకుంటుందని ఆయన అన్నారు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మూలాలు బలంగా ఉండటమే ఇందుకు కారణమని అన్నారు.

More Telugu News