: మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు?... ఈడీ పిటిషన్ పై నేడు కోర్టు విచారణ

వేలాది కోట్ల రుపాయల రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒక్క దెబ్బతో 17 బ్యాంకులకు షాకిచ్చిన మాల్యా... గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయారు. అప్పటిదాకా మాల్యా నుంచి రుణం వసూలు విషయంలో తాత్సారం చేసిన బ్యాంకులు, ఆయన లండన్ వెళ్లిపోయిన తర్వాత మాత్రం కోర్టులను ఆశ్రయించాయి. మాల్యా విషయంలో బ్యాంకులు అంత కఠినంగా వ్యవహరించకున్నా, నరేంద్ర మోదీ సర్కారు మాత్రం కొరడా ఝుళిపిస్తోంది. తన ముందు విచారణకు హాజరుకావాలన్న నోటీసులకు స్పందించని మాల్యా పాస్ పోర్టును రద్దు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖను కోరింది. వెనువెంటనే స్పందించిన విదేశాంగ శాఖ మాల్యా పాస్ పోర్టును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారంలోగా ఈ సస్పెన్షన్ పై మాల్యా స్పందించకుంటే పాస్ పోర్టును పూర్తిగా రద్దు చేస్తామని కూడా ఆ శాఖ హెచ్చరించింది. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ వేగంగా స్పందించిన నేపథ్యంలో ఈడీ మరో అడుగు ముందుకేసింది. తన నోటీసులకు స్పందించని మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును కోరింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఈడీ ప్రత్యేక కోర్టు నేడు తన నిర్ణయాన్ని వెలువరించనుంది. మాల్యా పాస్ పోర్టును విదేశాంగ శాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో కోర్టు కూడా మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

More Telugu News