: 11 ఏళ్లకే 72 కోట్ల టర్నోవర్ సాధించిన బుల్లి వ్యాపారవేత్త

గతంలో చిన్నపిల్లలకు ఆటలాడుకోవడమే తెలుసు. ఇప్పుడు కాలం మారడంతో చిన్న పిల్లలు సైతం కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. వినూత్న ఆలోచనలతో పెద్దలను అబ్బురపరుస్తున్నారు. అమెరికాలో 11 ఏళ్ల మికైలా ఉల్మర్ అనే బాలిక తన ఆలోచనను ఆచరణలో పెట్టడంతో ప్రస్తుతం ఆమె బుల్లి వ్యాపారవేత్గా రాణిస్తోంది. 2009లో ఏబీసీ న్యూస్ చానెల్ లో ప్రసారమైన 'షార్క్ ట్యాంక్' అనే కార్యక్రమాన్ని ఈ చిన్నారి చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ ఆలోచనలు చెబితే... వాటిని నచ్చిన కొంత మంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చి వ్యాపారం నెలకొల్పేందుకు సహాయం చేస్తారు. దీనిని చూసిన మికైలాకు తన అమ్మమ్మ చేసే నిమ్మపానీయం గుర్తుకొచ్చింది. సాధారణంగా నిమ్మరసంలో పంచదార లేదా ఉప్పు కలుపుతారు. కానీ మికైలా అమ్మమ్మ మాత్రం నిమ్మరసంలో తేనెతో పాటు అవిసె గింజలు కలిపేది. ఇది తాగేందుకు కొత్తగా, రుచికరంగా ఉండేది. దీంతో అదే పానియం తయారీని 'షార్క్ ట్యాంక్' షోలో వివరించింది. ఆ పానీయం తయారు చేసి, దానిని అక్కడి వారికి రుచి చూపించింది. దీంతో అక్కడికక్కడే ఆమె వ్యాపారానికి 60 వేల డాలర్ల పెట్టుబడులు సమకూరాయి. ఆ మొత్తంతో మికైలా 'బీస్వీట్ లెమెనెడ్' అనే పానీయం తయారీ కంపెనీ నెలకొల్పింది. మొదట్లో ఈ పానీయాన్ని దగ్గర్లోని దుకాణాల్లో విక్రయించేది. దీనికి ఆదరణ పెరగడంతో ఈ వ్యాపారాన్ని అమెరికాలోని ఐదు రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో ప్రస్తుతానికి ఈ వ్యాపారం 72 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకోవడంతో చిన్న వయసులోనే కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించిన బుల్లి వ్యాపారవేత్తగా మికైలా పేరుప్రతిష్ఠలు సంపాదించుకుంది.

More Telugu News