: చివర్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో భారీ లాభాలు!

సెషన్ ఆరంభంలో శుక్రవారం నాటి ముగింపుకన్నా కిందకు జారి పోయిన సూచికలు, యూరప్ మార్కెట్ ప్రారంభం తరువాత పుంజుకున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత ఎఫ్ఐఐలతో పాటు, దేశవాళీ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు నూతన కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో బెంచ్ మార్క్ సూచికలు భారీ లాభాలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల సంపద లక్ష కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 348.32 పాయింట్లు పెరిగి 1.41 శాతం లాభంతో 25,022.16 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 116.20 పాయింట్లు పెరిగి 1.54 శాతం లాభంతో 7,671.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.09 శాతం, స్మాల్ క్యాప్ 0.63 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 46 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐడియా, బోష్, హిందాల్కో, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పెయింట్స్ తదితర కంపెనీలు లాభపడగా, లుపిన్, అంబుజా సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,712 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,490 కంపెనీలు లాభాల్లోను, 1,097 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాడు రూ. 93,80,671 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 94,96,915 కోట్లకు పెరిగింది.

More Telugu News