: ఏమాత్రం లేటైనా... సహారా చీఫ్ కూడా దేశం విడిచి పారిపోయేవారే!

మొత్తం 17 బ్యాంకులకు మస్కా కొట్టేసిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... ఎంచక్కా రుణాన్ని ఎగవేసి లండన్ పారిపోయారు. అప్పటిదాకా రుణ వసూళ్లకు సంబంధించి నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శించిన బ్యాంకులు... మాల్యా లండన్ చెక్కేశాక లబోదిబోమన్నాయి. కోర్టులను ఆశ్రయించాయి. అయితే అటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి దర్యాప్తు సంస్థలనే కాక, కోర్టుల నోటీసులను కూడా పెద్దగా పట్టించుకోని మాల్యా... ఇప్పడప్పుడే దేశం రాలేనని తేల్చేశారు. ఇక మాల్యా తరహాలోనే మరో బడా బిజినెస్ మ్యాన్ దేశం వదిలి పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారట. ఆయనెవరో కాదు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది ఇన్వెస్టర్లను మాయ మాటలతో నమ్మించేసి 24 వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్. 2014 మార్చి 4 నుంచి తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న రాయ్... తన అరెస్ట్ కు ముందు దేశం విడిచి పారిపోయేందుకు యత్నించారట. సుబ్రతో రాయ్ కేసులో సెబీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అరవింద్ దాతర్ ఈ సంచలన విషయాన్ని నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లతో వ్యాపార చర్చల పేరిట రాయ్ చల్లగా జారుకునేందుకు పక్కాగానే ప్లాన్ చేసుకున్నారని దాతర్ ఆరోపించారు. అయితే, అప్పటికే సహారా గ్రూపు సేకరించిన డిపాజిట్లకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడానికి కాస్తంత ముందుగా ఆయన ఈ యత్నం చేశారట. అయితే రాయ్ ప్లాన్ వర్కవుట్ కాకముందే సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేయడం, పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలు ఏ మాత్రం లేటైనా... సుబ్రతో రాయ్ కూడా డిపాజిటర్లను నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసేవారే.

More Telugu News