: పిల్లల చిత్రం 'జంగిల్ బుక్' భయపెడుతుందట... యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై నిరసనల సెగ

జంగిల్ బుక్... ఎన్నో దశాబ్దాల క్రితం వచ్చిన చిన్న పిల్లల కథ. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అడవిలో చేరిన ఓ చిన్నారి, అక్కడి జంతువులతో కలసిపోయి ఎలా ఎదిగాడన్న స్టోరీ. పిల్లలకు ఎంతో ఆసక్తికరమైన పాత్రలతో తీర్చిదిద్దిన ఈ కథపై గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ కోవలో ఈ స్టోరీని పూర్తి రియల్ టైమ్ మూవీగా చేస్తూ, డిస్నీ నిర్మించిన తాజా చిత్రం 'జంగిల్ బుక్'కు భారత సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా పిల్లలను భయపెడుతుందని చెప్పిన సెన్సార్ చీఫ్ ప్రహ్లాద్ నిహలానీ, 3డీలో సినిమా చూస్తుంటే, నిజమైన జంతువులు మీదకు దూకినట్టుగా అనిపిస్తోందని, ఈ కారణంతోనే పిల్లలు భయపడతారని భావిస్తున్నామని అన్నారు. ఇక ప్రహ్లాద్ నిర్ణయంపై చిత్ర ప్రముఖులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లల కథ జంగిల్ బుక్ కు యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తారా? ఇదేం భయపెడుతోంది? అని విజయ్ వెంకటరామన్ వ్యాఖ్యానించగా, 'ఆయనెప్పుడూ ఇంతే, ప్రపంచంలోని కమేడియన్లందరి కన్నా ఇతనే బెటర్' అని ప్రేరణా మల్ హోత్రా, 'ఆయనకు ఏమైంది? ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెటా? థ్యాంక్ గాడ్, 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వలేదు' అని పంకజ్ జంగిద్ విమర్శించారు. ఇక ప్రహ్లాద్ నిహలానీ భయపడివుంటారని ఒకరు, పక్కనే ఎవరో పెద్దలను కూర్చోబెట్టుకుని ఆయన ఈ చిత్రాన్ని చూసి వుంటారని ఇంకొకరు, తనకు నవ్వాగడం లేదని మరొకరు, 3డీలో చూస్తే, జంతువులు అందరిమీదా దూకినట్టే కనిపిస్తాయి. దాన్నే 3డీ అంటారు... యూ ఈడియట్... ఇలా సాగుతున్నాయి ఆయపై విమర్శలు.

More Telugu News