: కొనేవారు కరవై మార్కెట్ బేలచూపులు

భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగింది. ఆర్బీఐ పరపతి సమీక్ష తరువాత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, మరింత నష్టాల్లోకి సూచికలు వెళ్లిపోయాయి. సెషన్ ఆరంభంలోనే ఇన్వెస్టర్లు ఈక్విటీల అమ్మకాలకు ప్రయత్నించగా, ఆపై మరే దశలోనూ మార్కెట్ కోలుకోలేదు. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 215.21 పాయింట్లు పడిపోయి 0.86 శాతం నష్టంతో 24,685.42 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 67.90 పాయింట్లు పడిపోయి 0.89 శాతం నష్టంతో 7,546.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.45 శాతం, స్మాల్ క్యాప్ 0.42 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 14 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా, లుపిన్, అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభపడగా, టాటా పవర్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ, లార్సెన్ అండ్ టూబ్రో తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,686 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,115 కంపెనీలు లాభాల్లోను, 1,455 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 93,52,147 కోట్లకు తగ్గింది.

More Telugu News