: ఇన్వెస్టర్లను మెప్పించని రఘురాం రాజన్... 500 పాయింట్ల పైన సెన్సెక్స్ డౌన్.. 1.60 లక్షల కోట్లు హాంఫట్!

ఇండియాలో వడ్డీ రేట్లు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను మెప్పించలేక పోయింది. ఆర్థిక పరమైన అంశాలన్నీ అనుకూలిస్తున్న వేళ, కనీసం 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు తగ్గుతాయని నిపుణులు అంచనా వేసిన వేళ 25 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గుదల నిర్ణయం వెలువడటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించింది. ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం ప్రారంభమయ్యే వరకూ క్రితం ముగింపుతో పోలిస్తే 120 పాయింట్ల నష్టంలో ఉన్న సెన్సెక్స్ సూచిక, ఆపై భారీ అమ్మకాల ఒత్తిడికి గురైంది. విదేశీ సంస్థాగత సంస్థలతో పాటు దేశవాళీ రిటైల్ ఇన్వెస్టర్లు కూడా లాభాల స్వీకరణకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనం కాగా, దాదాపు 1.60 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 516.06 పాయింట్లు పడిపోయి 2.03 శాతం నష్టంతో 24,883.59 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 155.60 పాయింట్లు పడిపోయి 2.01 శాతం నష్టంతో 7,603.20 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.47 శాతం, స్మాల్ క్యాప్ 1.40 శాతం నష్టపోయాయి. బ్యాంకింగ్ సెక్టార్ అత్యధికంగా నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 4 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సీఎల్ టెక్, లుపిన్ తదితర కంపెనీలు లాభపడగా, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,639 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 884 కంపెనీలు లాభాల్లోను, 1,630 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాటి సెషన్లో రూ. 95,28,977 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 93,66,204 కోట్లకు తగ్గింది. తదుపరి సెషన్లలో సైతం మార్కెట్ ఒడిదుడుకులకు లోను కావచ్చని ట్రేడింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News