: గృహ, వాహన రుణాల కిస్తీలు కట్టే వారికి శుభవార్త... బ్యాంకులు కనికరిస్తేనే సుమా!

బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకుని నెలసరి కిస్తీలు చెల్లిస్తూ వస్తున్న రుణగ్రస్తులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురును అందించింది. రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ పరపతి సమీక్షలో తన నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో రెపో రేటును తగ్గించినప్పుడు ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు దగ్గర చేయడంలో బ్యాంకులు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్న సంగతిని దృష్టిలో ఉంచుకుని, ఆర్బీఐ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే డబ్బుపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, బ్యాంకులు ఆర్బీఐ వద్ద దాచుకునే డబ్బుపై ఇచ్చే వడ్డీని పావు శాతం పెంచుతున్నట్టు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వాస్తవానికి ఇండియాలో రెపో, రివర్స్ రెపో రేట్ల మధ్య తేడా దీర్ఘకాలంగా ఒక శాతం వద్ద నిలబడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ తాజా నిర్ణయంతో తేడా అర శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో సీఆర్ఆర్ నిర్వహణను 95 శాతం నుంచి 90 శాతానికి తగ్గించింది కూడా. దీంతో బ్యాంకులు మరిన్ని రుణాలను ఇచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇప్పటికే రెపో రేటు తగ్గాల్సిన దానికన్నా ఎక్కువగా తగ్గిందని వ్యాఖ్యానించిన రఘురాం రాజన్, ప్రస్తుతానికి ఈ వెసులుబాటు చాలని, వెంటనే బ్యాంకులు స్పందించాలని సూచించారు. ఇటీవలే పేదల పొదుపు ఖాతాలపై ఇస్తున్న వడ్డీలను సైతం తగ్గించిన నేపథ్యంలో, రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాల్సిన ఒత్తిడి బ్యాంకులపై పడింది. బ్యాంకులు కనికరిస్తే, కిస్తీలు కడుతున్న వారి జేబుల్లో కొంత చిల్లర మిగులుతుంది. ఇక బ్యాంకులు ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.

More Telugu News