: ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలు!

మరో 24 గంటల వ్యవధిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణితో ఉండటంతో స్టాక్ మార్కెట్ సూచికలు ఒడిదుడుకుల మధ్య ఎటూ కదల్లేక పోయాయి. దీనికి తోడు నల్లకుబేరుల వివరాలతో 'పనామా పేపర్స్' విడుదల కావడం, ఈ జాబితాలో కార్పొరేట్ల పేర్లుండటం కూడా నూతన కొనుగోళ్లకు అడ్డుగా నిలిచింది. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 130.01 పాయింట్లు పెరిగి 0.51 శాతం లాభంతో 25,399.65 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 45.75 పాయింట్లు పెరిగి 0.59 శాతం లాభంతో 7,758.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.24 శాతం, స్మాల్ క్యాప్ 0.52 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐడియా, టాటా పవర్, భారతీ ఎయిర్ టెల్, ఎంఅండ్ఎం తదితర కంపెనీలు లాభపడగా, అంబుజా సిమెంట్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాసిమెంట్స్, మారుతి సుజుకి తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,746 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,651 కంపెనీలు లాభాల్లోను, 962 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 95,28,977 కోట్లకు పెరిగింది.

More Telugu News