: అబ్బే... ఇది చాలదు: మాల్యా రూ. 4 వేల కోట్ల ఆఫర్ పై బ్యాంకుల అనాసక్తి!

సెప్టెంబరులోగా రూ. 2 వేల కోట్లను బ్యాంకులకు చెల్లిస్తానని, ఆపై మరో రెండు వేల కోట్లను బ్యాంకులతో కుదుర్చుకున్న నిబంధనల మేరకు చెల్లించగలనని యూబీ గ్రూప్ మాజీ యజమాని విజయ్ మాల్యా సుప్రీంకోర్టుకు చేసిన రాజీ ప్రతిపాదనపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం పెదవి విరిచింది. ఆయన బకాయి పడిన డబ్బుతో పోలిస్తే, బ్యాంకుల దృష్టిలో ఇది చాలా చిన్న మొత్తమని, ఈ ప్రతిపాదనపై చర్చించిన బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మాల్యా చెప్పిన మాటల్లో స్పష్టత కూడా కరవైందని ఆయన అన్నారు. ఇప్పటికే బ్యాంకుల వద్ద తనఖాలో ఉన్న ఆయన కంపెనీల వాటాలనే రూ. 2 వేల కోట్లుగా చూపించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కనీసం రూ. 8 వేల కోట్ల ప్లాన్ తో వస్తేనే మాల్యాతో చర్చించాలని కన్సార్టియం నిర్ణయించినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి వివరించారు. కాగా, మొత్తం 17 బ్యాంకుల కన్సార్టియానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ గా ఉండగా, రుణాలకు సంబంధించి 20 కేసులు ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News