: అందరి కళ్లూ ఆర్బీఐ గవర్నర్ పైనే... ఆసక్తితో ఎదురుచూస్తున్న మార్కెట్ వర్గాలు!

వచ్చే మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్షను జరపనున్న తరుణంలో, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఏ దిశగా అడుగులు వేస్తారన్న విషయమై మార్కెట్ వర్గాలతో పాటు పారిశ్రామిక వేత్తలు ఆసక్తితో చూస్తున్నారు. ఫిబ్రవరిలో పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనల తరువాత, రుణ లభ్యత సులభతరం అయ్యేలా నిర్ణయాలతో పాటు, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేయడంతో, మరో పావు శాతం వరకూ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం వెలువడవచ్చని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 0.3 శాతం నష్టాన్ని నమోదు చేసిన నేపథ్యంలో, తదుపరి మార్కెట్ గమనం సైతం ఆర్బీఐ నిర్ణయంపై ఆధారపడనుందని, దీంతో పాటు మినీ సార్వత్రిక ఎన్నికలుగా గుర్తింపు పొందిన ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో వెలువడే ఫలితాలు సైతం బెంచ్ మార్క్ సూచికలకు దిశానిర్దేశం చేయనున్నాయని బ్రోకరేజి సంస్థ మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. ముఖ్యంగా అసోం ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, కొత్తగా ఈక్విటీల కొనుగోళ్లు వెల్లువెత్తవచ్చని పేర్కొంది. నిఫ్టీ సూచిక కీలకమైన 8 వేల పాయింట్లను దాటి ముందడుగు వేయాలంటే, కనీసం పావు శాతం రెపో రేటు తగ్గింపు తప్పనిసరని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను కేంద్రం తగ్గించిన నేపథ్యంలో, ఆర్బీఐకి సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వెసులుబాటు లభించిందని, ఇక అర శాతం వరకూ వడ్డీ తగ్గితే, మార్కెట్లు మరింతగా దూసుకెళ్తాయని మిడ్ క్యాప్ రీసెర్చ్ సంస్థ ఎంఓఎస్ఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రవి షినాయ్ పేర్కొన్నారు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్- క్యాష్ రిజర్వ్ రేషియో) సైతం తగ్గవచ్చని, తద్వారా మరింత డబ్బు చలామణిలోకి వస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని భావించే వారు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ పడిపోయినప్పుడు నూతన కొనుగోళ్లకు ప్రయత్నించవచ్చని, నిఫ్టీ సూచికలో 100 నుంచి 130 పాయింట్ల కరెక్షన్ నమోదు కావచ్చని ఎడిల్ వైజెస్ సెక్యూరిటీస్ ప్రతినిధి సాహిల్ కపూర్ అంచనా వేశారు. నిఫ్టీ 7,600 నుంచి 7,630 పాయింట్లకు చేరితే కొత్త కొనుగోళ్లు జరపవచ్చని, 7,950 పాయింట్ల నుంచి 8 వేల పాయింట్ల మధ్య లాభాల స్వీకరణ ఎదురుకావచ్చని తెలిపారు.

More Telugu News