: ఏపీలో రూ. 34 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓఎన్జీసీ

ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతంలోని కృష్ణా గోదావరి చమురు క్షేత్రంలో ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వచ్చే నాలుగేళ్లలో రూ. 34,012 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ డీకే సరాఫ్ బోర్డు సభ్యులకు వెల్లడించారు. "2020 నాటికి క్లస్టర్ 2ఎ, 2బిల్లో ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుబడులు పెట్టనున్నాం. 2023 నాటికి సగటున 35 లక్షల టన్నుల క్రూడాయిల్ వెలికితీయాలన్నది మా ఉద్దేశం. పూర్తి స్థాయిలో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైతే 5 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు దేశానికి లభిస్తుంది" అని ఆయన అన్నారు. కాగా, 2014-15లో ఒఎన్జీసీ మొత్తం 18 మిలియన్ టన్నుల క్రూడాయిల్ ను వెలికి తీసింది. ఇదే సమయంలో ఇండియా మొత్తం క్రూడాయిల్ ఉత్పత్తి 38 మిలియన్ టన్నులుగా ఉంది. కంపెనీ నిర్వహణలోని కేజీ-డీ5 బేసిన్ లోని సహజవాయువు పక్కనే రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న చమురు క్షేత్రాల్లోకి తరలి వెళుతోందని ఓఎన్జీసీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది క్లస్టర్ 1 పరిధిలో ఉండటంతో, ఇక్కడ పెట్టుబడి పెట్టినా వృథాయేనని సంస్థ భావిస్తోంది. ఈ కారణం చేతనే కేజీ-డీ5లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని భావించడం లేదని సరాఫ్ తెలిపారు.

More Telugu News