: ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ... భారీ నష్టాల్లో మార్కెట్!

సుదీర్ఘ వారాంతపు సెలవుల అనంతరం, అంతర్జాతీయ మార్కెట్ల సరళి ఇన్వెస్టర్లపై ప్రభావం చూపడంతో, అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తగా, బెంచ్ మార్క్ సూచికలు భారీగా నష్టపోయాయి. సెషన్ ఆరంభంలో గత వారం ముగింపు వద్దే ఉన్న సూచికలు, ఆపై నష్టాల్లోకి జారిపోయి, మరే దశలోనూ తేరుకునేలా కనిపించలేదు. సుమారు రూ. 75 వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 371.16 పాయింట్లు పడిపోయి 1.46 శాతం నష్టంతో 24,966.40 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 101.40 పాయింట్లు పడిపోయి 1.31 శాతం నష్టంతో 7,615.10 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.36 శాతం, స్మాల్ క్యాప్ 1.65 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 15 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, బోష్ లిమిటెడ్, ఎన్టీపీసీ, బీపీసీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, హిందాల్కో, టాటా స్టీల్, సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,849 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 741 కంపెనీలు లాభాల్లోను, 1,943 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 93,04,375 కోట్లకు తగ్గింది.

More Telugu News