: మీ పిల్ల‌ల భ‌విష్య‌త్తు మీ పెంపకంలోనే ఉంది!

త‌ల్లిదండ్రుల‌ పెంప‌క‌మే పిల్లల చ‌క్క‌ని భ‌విష్య‌త్తుకి పునాది అవుతుంది. వారిలో ఆత్మ‌విశ్వాసం నిండాల‌న్నా.. ఆత్మ‌న్యూన‌తా భావం త‌గ్గాల‌న్నా అన్నీ త‌ల్లిదండ్రుల చేతిలోనే ఉన్నాయి. నేటి కాలంలో పిల్లలను తమ స్టేటస్‌కు ప్రతిబింబంలా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో పిల్ల‌లపై ఊహించ‌ని విధంగా త‌ల్లిదండ్రుల ప్ర‌భావం ప‌డుతోంది. ప్రతి పిల్లాడి భవిష్యత్‌ను నిర్దేశించేది తరగతి గదే అయినా.. పిల్లాడి ఎదుగుదలపై తల్లిదండ్రుల ప్రవర్తన తీవ్ర ప్రభావం చూపుతుంది. త‌న చేతిలో ఉన్న‌ సిగ‌రేట్ పీల్చుతూనే తండ్రి పిల్ల‌ల‌తో 'సిగ‌రేట్ తాగొద్దు' అని స్టైల్‌గా చెప్తాడు. తోటి వారిని ప్రేమించాలి అంటూ మానవ సంబంధాలపై పిల్ల‌ల‌కు అవగాహన కల్పించే ప‌ని చేస్తుంది త‌ల్లి.. ఓప‌క్క‌ త‌న భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డుతూ. రెండు సెల్‌ఫోన్ల‌ను వ‌ద‌ల‌కుండా ఉప‌యోగిస్తూ సెల్‌ఫోన్ వ‌ల్ల వ‌చ్చే నష్టాల గురించి పిల్ల‌ల‌కు బుద్ధులు చెప్తే వారు మాత్రం ఎలా వింటారు చెప్పండి..? ఇలాంటి కార‌ణాలే పిల్ల‌ల్ని మీ మాట‌విన‌కుండా చేస్తాయి. క్రమశిక్షణ మొదలు, అల‌వాట్లు వంటివి ప్రతిదీ తల్లిదండ్రులను చూసే పిల్ల‌లు నేర్చుకుంటారు. అందుకే వారి బంగారు భ‌విష్య‌త్తుని దృష్టిలో ఉంచుకొని స‌మాజంలో వారిని గొప్ప‌వ్య‌క్తులుగా తీర్చిదిద్దాల‌నుకుంటే కొన్ని చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు పాటించాలి. పిల్లలకు తల్లిదండ్రులు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే, వారు అంత చక్కని జీవితం గడుపుతారని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. పిల్ల‌ల‌తో ఫ్రెండ్లీగా ఉండాలి. వారు ఒంటరిగా ఉంటే మాట్లాడించే ప్రయత్నం చేయాలి. పిల్లలకు ఇష్టమైన రంగాల్లో, నచ్చే అంశాల్లో ప్రోత్సహించాలి. ఉద్యోగం, వ్యాపారంలో ఉండే మీ సమస్యల కోపాన్ని పిల్లలపై చూపొద్దు. అలాంటి సమయాల్లో ముందుగా మీ ఆందోళ‌నను తగ్గించుకునే ప్ర‌య‌త్నం చేయండి. కాసేపు నడవడం, ధ్యానం వంటివి చేయండి. ఇలా చేస్తే మీ పిల్ల‌లు కూడా క్రమంగా వాటినే పాటిస్తారు. తోటి విద్యార్థులలో వెనకబడినట్లు అనిపిస్తే అవమానించకుండా బాగా చదివితే ఎలాంటి గొప్ప స్థానానికి చేరుకోవచ్చో వివరించండి. ఈ పోటీ ప్రపంచంలో వారిని భాగ‌స్వాములుగా చేస్తూనే వారిపై ఒత్తిడి క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి. ఏదైనా తప్పు చేస్తే అది ఎందుకు తప్పో అర్థమయ్యేలా చెప్పాలి. అంతేకాని పోటీల‌లో వెనుక‌బ‌డి పోతున్నావంటూ ఇత‌ర పిల్ల‌ల‌తో పోల్చుతూ వారిని ప‌దే ప‌దే విసిగించొద్దు. చిన్నప్పటినుంచీ పిల్లల‌కి 'వారిలా చెయ్... వీరిలా చెయ్‌' అంటూ ఆదేశాలు జారీ చేస్తే వారిలో సహజసిద్ధంగా ఉండాల్సిన లక్షణాలు కనుమరుగై.. తల్లిదండ్రులు ఎలా చెబితే అలా నడుచుకునే మరబొమ్మల్లా తయారవుతార‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇది పిల్లలకు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. స‌హ‌జ‌త్వంగా ఆలోచించే జ్ఞానం వారిలో రాకుండా పోయే ప్ర‌మాదం ఉంటుంది. చదువే జీవితం కాదు అనే విషయాన్ని గుర్తించాలి. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రన తిడితే పాస్‌కారు. ఏదైనా తప్పు చేస్తే అది ఎందుకు తప్పో అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు పసివాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులుగానూ, 13ఏళ్లు వ‌చ్చాక‌ స్నేహితులుగానూ మెలగటం అవసరమ‌ని మానసిక వికాస నిపుణులు చెబుతున్నారు.

More Telugu News