: మాల్యాకు మరో దెబ్బ!... రూ.45 వేల పన్ను కట్టలేదని కోట్ల విలువైన ఐదెకరాల భూమి సీజ్

మూలిగే నక్కపై తాటి కాయ పడటమంటే ఇదే. లిక్కర్ వ్యాపారంలో కింగ్ గా ఎదిగిన విజయ్ మాల్యా... పౌర విమానయాన రంగంలో ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్’తో దివాలాకోరుగా మారారు. బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులు చెల్లించలేక ఆయన ఏకంగా దేశం వదిలి పారిపోయారు. ఈ క్రమంలో ఆయన నుంచి అప్పులను రాబట్టుకునేందుకు ఓ వైపు బ్యాంకులన్నీ జట్టుకట్టి రంగంలోకి దిగితే... కేవలం రెండేళ్లుగా పన్ను కట్టలేదన్న కారణం చూపి రెవెన్యూ అధికారులు కూడా ఆయనపై ముప్పేట దాడికి దిగారు. రూ.45 వేల పన్ను బకాయిలకు కోట్ల రూపాయల విలువ చేసే ఐదెకరాల మాల్యా స్థలం సీజ్ అయిపోయింది. వివరాల్లోకెళితే... మహారాష్ట్రలోని పుణే నగరానికి కూతవేటు దూరంలో రత్నగిరి జిల్లా చిప్లున్ మండలం పింపలిలో మాల్యా ఐదెకరాల తొమ్మిది గుంటల భూమిని కొనుగోలు చేశారు. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ గొడుగు కింద గతంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ బ్రూవరీస్ ఇంజినీరింగ్ లిమిటెడ్ పేరు మీద మాల్యా ఈ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలో గతంలో కొన్ని నిర్మాణాలు ఏర్పాటు చేసిన ఆ సంస్థ అందులో కొందరికి నివాసం కల్పించింది. అయితే ప్రస్తుతం ఈ నిర్మాణాల్లో ఎవరూ లేరు. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ భూమికి కట్టాల్సిన పన్నును మాల్యా కట్టలేదు. ఈ మొత్తం విలువ కేవలం రూ.45 వేలే. పన్ను వసూలు చేసేందుకు చిప్లున్ తహశీల్దార్ వృశాలి కదమ్ నోటీసులు జారీ చేశారు. పుణేలోని యూబీ కంపెనీ అడ్రెస్ కు పంపిన నోటీసులకు ఎలాంటి సమాధానం రాలేదట. దీంతో సదరు భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు కదమ్ తెలిపారు. ఈ మేరకు స్వాధీనానికి సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, త్వరలోనే ఆ భూమి ప్రభుత్వపరం కానుందని కదమ్ పేర్కొన్నారు.

More Telugu News