: 21 కంపెనీలు... రూ.13,330 కోట్లు!

ఏప్రిల్ 2015-ఫిబ్రవరి 2016 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ల ద్వారా నిధుల సమీకరణ గణనీయస్థాయిలో పెరిగింది. ఎంతగా అంటే, గడచిన ఐదేళ్లలోనే ఈ స్థాయిలో నిధుల సమీకరణ ఎన్నడూ నమోదు కాలేదు. ప్రైమ్ డేటా బేస్ ద్వారా లభ్యమైన సమాచారం మేరకు గత సంవత్సరం మార్చి నుంచి ఈ ఏడు ఫిబ్రవరి మధ్య 21 కంపెనీలు రూ.13,330 కోట్ల నిధులను ఐపీఓ ద్వారా సమకూర్చున్నాయి. అంతేకాకుండా, మార్చి 2016లో ఐపీఓ ల ద్వారా కేన్సర్ కేర్ స్పెషలిస్టు హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ కూడా రూ.650 కోట్ల విలువైన వాటాలను విజయవంతంగా విక్రయించగల్గింది. భారత్ కు చెందిన మొట్టమొదటి ఈ-కామర్స్ సంస్థ ఇన్ఫీ బీమ్ కార్పొరేషన్ ఒక ఐపీఓ ను ప్రారంభించి, రూ.450 కోట్లను సమీకరించింది. కాగా, 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ పద్ధతిలో 52 కంపెనీలు సంయుక్తంగా సమీకరించిన నిధులు రూ.33,098 కోట్లు. ఆపై గడచిన ఐదేళ్లుగా ప్రైమరీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపని సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గత నాలుగైదు నెలలుగా లాజిస్టిక్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లోని కంపెనీల పనితీరు మెరుగుపడటంతో ఇన్వెస్టర్ల దృక్పథం మారింది. దీంతో, ఇతర రంగాలపైనా ప్రభావం పడగా నిధుల సమీకరణ యత్నాలు విజయవంతమవుతున్నాయి.

More Telugu News