: ఇండియాకు బంపరాఫర్... మరింత తక్కువ ధరకు క్రూడాయిల్ ఇస్తామంటున్న ఇరాన్!

ఇండియాకు మార్కెట్ ధర కన్నా తక్కువకు క్రూడాయిల్ లభ్యం కానుంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆగడాలతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఇరాన్, మరింత ఆదాయాన్ని ఖజానాకు చేర్చే దిశగా, నాలుగవ అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న ఇండియాపై ఆశలు పెంచుకుంది. ఓ షిప్ ను రిఫైనరీ వద్దకు పంపితే, రవాణా, ఇన్స్యూరెన్స్ చార్జీలను తామే చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. సీఐఎఫ్ (కాస్ట్, ఇన్స్యూరెన్స్ అండ్ ఫ్రయిట్) విధానంలో ఏప్రిల్ 1 నుంచి ముడి చమురు రవాణాకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఓ ప్రైవేటు రిఫైనింగ్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరాన్ నుంచి క్రూడాయిల్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించిన తరువాత ఇండియాకు అపరిమిత క్రూడాయిల్ రవాణాకు మార్గం సుగమమైంది. ఓఎన్జీసీ అనుబంధ సంస్థగా ఉన్న మంగళూరు రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్ (ఎంఆర్పీఎల్) సంస్థ నెలవారీ క్రూడాయిల్ రవాణాకు ఇరాన్ చమురు సంస్థలతో ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకోగా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సైతం అదే దారిలో నడుస్తోంది. కాగా, ఇరాన్ కు చైనా తరువాత అతిపెద్ద ముడి చమురు కస్టమర్ గా ఇండియా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికితోడు, ఇప్పటివరకూ ఉన్న 30 రోజుల క్రెడిట్ పీరియడ్ ను 90 రోజులకు పెంచేందుకు కూడా ఇరాన్ అంగీకరించింది. ప్రస్తుతం సంవత్సరానికి కోటి టన్నుల వరకూ ఇరాన్ క్రూడాయిల్ ఇండియాలోని ఎస్సార్ ఆయిల్, ఎంఆర్పీఎల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అంటే సగటున రోజుకు 2.6 లక్షల బ్యారళ్ల క్రూడాయిల్ ఇండియాకు వస్తున్నట్టు. ఇక ఇప్పుడు ఈ మొత్తం మరింతగా పెరుగుతుందని అంచనా.

More Telugu News