: విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్... రూ. 7,262 కోట్లు వచ్చేలా 15 ప్రతిపాదనలకు అనుమతి!

జపాన్ ఇన్స్యూరెన్స్ సంస్థ నిప్పాన్ లైఫ్, టాటా ఏఐజీ, అవీవా లైఫ్ తదితర 15 కంపెనీలు దాఖలు చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల్లోకి రూ. 7,262 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఓకే చెప్పింది. ఎఫ్ఐపీబీ (ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు) సిఫార్సుల మేరకు వీటికి ఆమోదం పలికినట్టు తెలిపింది. మరో రూ. 6,885 కోట్ల మేరకు ఎఫ్డీఐ ప్రతిపాదనలను సీసీఈఏ ముందుంచినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ లైఫ్ లో 26 శాతంగా ఉన్న వాటాను 49 శాతానికి పెంచుకునేలా రూ. 2,265 కోట్ల పెట్టుబడులతో నిప్పాన్ లైఫ్, టాటా ఏఐజీలో ఏఐఏ ఇంటర్నేషనల్ వాటా పెంచుకునేందుకు రూ. 2,055 కోట్ల ప్రతిపాదనలతో పాటు, అవీవా లైఫ్ లో అవీవా ఇంటర్నేషనల్ వాటాను పెంచుకునేందుకు రూ. 940 కోట్లు తదితర ప్రతిపాదనలు అనుమతిని పొందాయి. ఎఫ్డీఐ ప్రతిపాదనలను త్వరితగతిన క్లియర్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వీటికి ఆమోదం పలికినట్టు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ ట్వీట్ చేశారు.

More Telugu News