: ఓ మైగాడ్... మాల్యా చిన్న చేపే, అదే దారిలో మరెన్నో కంపెనీలు!

విజయ్ మాల్యా... దేశంలో బ్యాంకులకు కట్టాల్సిన రుణాల మొత్తం వడ్డీతో కలిపి సుమారు రూ. 9 వేల కోట్లు. మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన బ్యాంకులు, ఆ మొత్తాన్ని నిరర్థక ఆస్తులుగా ప్రకటించాలని భావిస్తున్నాయి. బ్యాంకులకు మాల్యా చెల్లించాల్సిన మొత్తం కన్నా అధికంగా బకాయిలు పడ్డ కంపెనీలు చాలానే ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద ఉన్న నిరర్థక ఆస్తులు (నాన్ పెర్ ఫార్మింగ్ అసెట్స్ - ఎన్పీయే) ఎంతో తెలుసా? రూ. 3,90,443 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ఇక అన్ని బ్యాంకుల ఎన్పీయేను పరిశీలిస్తే, అది రూ. 4.36 లక్షల కోట్లకు పైగానే ఉంది. ఇక బ్యాంకులకు అత్యధికంగా బకాయిలు చెల్లించాల్సి వున్న కంపెనీల విషయానికి వస్తే జేపీ గ్రూప్, లాంకో, జీఎంఆర్, ఎస్సార్, జీవీకే వంటి కంపెనీలెన్నో ఉన్నాయి. క్రెడిట్ సూస్ వెల్లడించిన 'హౌస్ ఆఫ్ డెట్' నివేదిక ప్రకారం, గత సంవత్సరం అక్టోబర్ నాటికి ఇండియాలో ఉన్న ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 5,275. వీరు ఎగ్గొట్టిన మొత్తం రూ. 56,521 కోట్లకు పైమాటే. ఇక ఈ సంస్థలకు ఆర్బీఐ చివరి అవకాశాన్ని ఇచ్చింది. బ్యాలెన్స్ షీటులను 2017 ముగిసేలోగా సరిచేసుకోవాలని హెచ్చరించింది. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉన్న చోట, సదరు కంపెనీల నియంత్రణను టేకోవర్ చేసుకునేందుకు బ్యాంకులకూ అనుమతిచ్చింది. అయితే, ఇక్కడ రుణ మొత్తం 51 శాతం ఈక్విటీ కన్నా అధికంగా ఉండాల్సి వుంది. బ్యాంకులకు అధికంగా బకాయిలు ఉన్న కంపెనీల్లో అలోక్ ఇండస్ట్రీస్ రూ. 15,350 కోట్లు (ఎస్బీఐ), గామన్ ఇండియా రూ. 14,810 కోట్లు (ఐసీఐసీఐ నేతృత్వంలోని 19 బ్యాంకుల కన్సార్టియం), మానెట్ ఇస్పాత్ రూ. 12,500 కోట్లు (16 బ్యాంకులకు), ఎలక్ట్రో స్టీల్స్ రూ. 10,990 కోట్లు (ఎస్బీఐ నేతృత్వంలోని 27 బ్యాంకుల కన్సార్టియం), ఐవీఆర్సీఎల్ రూ. 10,340 కోట్లు (ఎస్బీఐ నేతృత్వంలోని 21 బ్యాంకుల కన్సార్టియం), కోస్టల్ ప్రాజెక్ట్స్ రూ. 5,810 కోట్లు (ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం), ట్రాన్స్ ట్రాయ్ రూ. 4,300 కోట్లు (14 బ్యాంకులకు) బకాయి పడ్డాయి. వీటితో పాటు శివ్ వాణి ఆయిల్ అండ్ గ్యాస్ రూ. 4,010 కోట్లు, ఆధునిక్ పవర్ రూ. 3,120 కోట్లు, విసా స్టీల్ రూ. 3,090 కోట్లు, జ్యోతి సెక్యూరిటీస్ రూ. 2,640 కోట్లు, రోహిత్ ఫెర్రో టెక్ రూ. 2,630 కోట్లు బకాయి పడ్డాయి. ల్యాంకో టీస్టా, జీఓఎల్ ఆఫ్ షోర్, ఏఎండబ్ల్యూ మోటార్స్, అంకిత్ మెటల్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు రూ. 800 కోట్ల నుంచి రూ. 2,400 కోట్ల వరకూ బ్యాంకులకు చెల్లించాల్సి వుంది. మరెన్నో సంస్థల బాకాయిలు వందల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఇక వీటన్నింటినీ పరిశీలించి, బ్యాంకుల బకాయిలను వెనక్కు తీసుకువచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ స్వయంగా కదిలారు. ఈ కంపెనీలకు మరో బ్యాంకు రుణాలను ఇవ్వరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్డీఆర్ (స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ - వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ)ను ప్రకటించి, బ్యాంకులు కంపెనీల నియంత్రణా హక్కులను పొందేలా నిబంధనలను మార్చారు. ఈ తాజా చర్యలతోనైనా ప్రమాదకర స్థాయికి చేరిన బ్యాంకుల నిరర్థక ఆస్తుల మొత్తం తగ్గుతుందేమో!

More Telugu News