: అద్భుతమైన క్యాచ్ పట్టి గాయపడ్డ పాండ్య... రెండు వికెట్లు పడ్డాయి

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు నిలకడ ప్రదర్శిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు అద్భుతమైన ఓపికను ప్రదర్శిస్తోంది. ఈ ఉదయం కురిసిన వర్షానికి పిచ్ తడిసిపోవడంతో బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతోంది. దీంతో ఈ పిచ్ పై పరుగులు సాధించడం అంత సులువు కాదని పాక్ ఆటగాళ్లు వస్తూనే అర్థం చేసుకున్నారు. దీంతో మంచి బంతులను శిక్షిస్తూ ఓపికను ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో రన్ రేట్ పడిపోకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్ల ఆటలు సాగడం లేదు. వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెడదామన్న భారత్ బౌలర్ల వ్యూహం ఫలించకపోవడంతో, ధోనీ బౌలర్లను మార్చుతూ ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రైనా బౌలింగ్ లో షెర్జిల్ ఖాన్ (17) భారీ షాట్ కు యత్నించాడు. బంతి గాల్లోకి లేవడం చూసిన హార్దిక్ పాండ్య లాంగ్ ఆఫ్ నుంచి మిడ్ వికెట్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. అయితే, ఆ వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో పాండ్య ముఖం నేలను బలంగా తాకింది. దీంతో అతను గాయపడ్డాడు. అంత దెబ్బతగిలినా క్యాచ్ వదలకపోవడంతో అంతా అతనిని అభినందించారు. గాయం కారణంగా పాండ్య మైదానం వీడాడు. అనంతరం బుమ్రా వేసిన బంతిని భారీ షాట్ గా మలచేందుకు ప్రయత్నించిన షెహజాద్ (25) ను జడేజా ఒడిసిపట్టేశాడు. దీంతో పాక్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. భారీ స్కోరుపై కన్నేసిన పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఫస్ట్ డౌన్ లో రావడం విశేషం. కాగా పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన పాక్ 51 పరుగులు చేసింది.

More Telugu News