: సిబిల్ స్కోరుకు కలవనున్న సోషల్ మీడియా, ఆన్ లైన్ లావాదేవీలు!

ఏదైనా రుణం కోసం బ్యాంకు గడపను తొక్కిన వేళ, బ్యాంకులు తొలుత సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్కోరును నిశితంగా గమనిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇకపై సిబిల్ స్కోరును ప్రభావితం చేసేలా మరిన్ని అంశాలు కలవనున్నాయి. వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టులు, మిత్రులు, డిజిటల్ లావాదేవీలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సిబిల్ భావిస్తోంది. ఈ మేరకు రుణ సమాచార చట్టాన్ని (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్)కు సవరణలు తెచ్చే అవకాశాలు ఉన్నట్టు సిబిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్షలా చందోర్కర్ వెల్లడించారు. "ఇప్పటి వరకూ పాత చట్టాలకు అనుగుణంగానే స్కోరు ఇస్తున్నాము. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు తేవాల్సి వుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలసి ఈ దిశగా చర్చిస్తున్నాం. చట్ట పరిధిని మరింతగా విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యోచిస్తున్నాం. రహస్యంగా ఉండాల్సిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాల్సి వుంది కాబట్టి నియంత్రణా విధానం మారాల్సి వుంది" అని ఆయన అన్నారు. ఈ విధానం అమలైతే, ఇంతవరకూ ఏ బ్యాంకు నుంచీ కూడా రుణాలను పొందక, సిబిల్ స్కోరు లేని వారికి త్వరితగతిన రుణాలు మంజూరయ్యే అవకాశాలు మెరుగవుతాయని ఆయన తెలిపారు.

More Telugu News