: ఐసీఐసీఐ, కోటక్ తప్పుకోవడంతో కష్టాల్లో ఇన్ఫీబీమ్!

ఓ చిన్న స్టార్టప్ సంస్థగా ప్రారంభమైన ఈ-కామర్స్ సేవల సంస్థ ఇన్ఫీబీమ్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తూ, స్టాక్ మార్కెట్ ను ఆశ్రయించగా, ఇప్పటివరకూ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లుగా సేవలందించిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా కాపిటల్ సంస్థలు వెనక్కు తగ్గుతున్నట్టు సంచలన ప్రకటన చేశాయి. సంస్థ రూ. 450 కోట్లను సమీకరించే లక్ష్యంతో మార్కెట్ కు రాగా, సంస్థ విలువను రూ. 2,200 కోట్లుగా నిపుణులు లెక్కగట్టారు. ఈ మొత్తం తమ స్థాయికి తక్కువని భావిస్తూ, ఐసీఐసీఐ, కోటక్ సంస్థలు ఐపీఓ నుంచి విరమించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, పరస్పర అవగాహనతోనే తాము ఐపీఓ నుంచి విరమించుకున్నామని, వారి సంస్థ వాటాలకు మంచి డిమాండ్ వచ్చి నిధుల సమీకరణ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు కోటక్ మహీంద్రా గ్రూప్ వ్యాఖ్యానించింది. మొత్తం నాలుగు సంస్థలను ఇన్ఫీబీమ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లుగా నియమించుకుంది. ఇప్పుడీ సంస్థలు తప్పుకోవడంతో ఎస్బీఐ కాపిటల్, ఎలారా కాపిటల్ సంస్థలు మిగిలాయి. ఇదిలావుండగా, 2015-16 తొలి ఆరు నెలల కాలంలో రూ. 175 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన ఇన్ఫీబీమ్ రూ. 6.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ నెల 21 నుంచి ఐపీఓ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్లు అకస్మాత్తుగా తప్పుకోవడం చర్చనీయాంశమైంది.

More Telugu News