: ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లను థ్రిల్ చేస్తున్న వాట్స్ యాప్ కొత్త ఫీచర్లు

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడకందారులను కస్టమర్లుగా కలిగివున్న మెసేజింగ్ సేవల యాప్, వాట్స్ యాప్ కొత్త అప్ డేటెడ్ వర్షన్ విడుదలైంది. 2.12.15గా మార్కెట్లోకి వచ్చిన ఈ వర్షన్ ఓ గిఫ్ట్ లాంటిదని, మెసేజింగ్ సర్వీస్ మరింత సరళీకృతమైందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కొత్త వర్షన్ లోని కొంగొత్త ఫీచర్లివి. ఫోటో షేరింగ్ మరింత ఈజీ: మీ ఫోన్ లోని ఇతర యాప్స్ లో ఉన్న చిత్రాలను మరొకరితో షేర్ చేసుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఈ వాట్స్ యాప్ కొత్త ఫీచర్ తో డ్రాప్ బాక్స్ లేదా గూగుల్ డ్రైవ్ లేదా మైక్రోసాప్ట్ వన్ డ్రైవ్ లోని చిత్రాలను ఒక్క క్లిక్ తో స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. ఫోటోలను సెలక్ట్ చేయగానే ఈ ఆప్షన్ స్క్రీన్ చివర కనిపిస్తుంది. డాక్యుమెంట్ షేరింగ్: పిక్చర్స్ మాదిరిగానే మీరు మాట్లాడుకున్న చాటింగ్ వివరాల డాక్యుమెంట్లతో పాటు ఎలాంటి ఇతర ఫైల్ నైనా షేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఎడమచేతి కార్నర్ వైపున్న యారో బటన్ నొక్కాల్సివుంటుంది. అయితే, కేవలం 100 మెగాబైట్ల సైజు వరకూ ఉన్న డాక్యుమెంట్ల బట్వాడాకు మాత్రమే సహకరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ కలర్స్: లేటెస్ట్ అప్ డేట్ తో వాట్స్ యాప్ బ్యాక్ గ్రౌండ్ ను మీకు నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు. లేదంటే మీ ఫోటో లైబ్రరీ నుంచి నచ్చిన చిత్రాన్ని వాల్ పేపర్ గా అమర్చుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్: యాప్ పనిచేయాలంటే అవసరమైన స్పేస్ గణనీయంగా తగ్గింది. ఈ కొత్త వర్షన్ వాడి మరింత మ్యూజిక్, మెసేజ్ లను స్టోర్ చేసుకోవచ్చు. వీడియో జూమ్: ఇది అందరికీ నచ్చే మరో ఫీచర్. వాట్స్ యాప్ వీడియోలు చూస్తూ, రెండు వేళ్ల సాయంతో జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసే సదుపాయం ఉంది. ఈ ఫీచర్ నిజంగా థ్రిల్ చేసేదే. మరి వాట్స్ యాప్ ను అప్ డేట్ చేసుకుని ఈ ఫీచర్లు చూసుకున్నారా?

More Telugu News