: ఇండియాలో దారుణంగా పడిపోతున్న టాబ్లెట్ అమ్మకాలు!

గడచిన సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లో టాబ్లెట్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. జూలై - ఆగస్టుతో పోలిస్తే అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో టాబ్లెట్ల అమ్మకాలు 18.7 శాతం మేరకు తగ్గాయి. అదే గత సంవత్సరం మూడవ త్రైమాసికంతో పోలిస్తే 10.1 శాతం అమ్మకాల కోత నమోదైంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2015లో మొత్తం 38 లక్షల యూనిట్ల అమ్మకాలు సాగాయి. మొత్తం మీద 2014తో పోలిస్తే 8.2 శాతం మేరకు అమ్మకాలు పెరిగినప్పటికీ, గత నాలుగైదు నెలలుగా విక్రయాలు కుంటుబడ్డాయని, ఈ సంవత్సరం తొలి రెండు నెలలూ అదే పరిస్థితి నెలకొందని ఐడీసీ సీనియర్ మార్కెటింగ్ అనలిస్ట్ జే కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం టాబ్లెట్ల అమ్మకాల్లో వృద్ధి పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో మార్కెట్ సంతృప్తస్థాయికి చేరడమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. సమీప భవిష్యత్తులో రూ. 12 వేల నుంచి రూ. 18 వేల మధ్య లభించే టాబ్లెట్ల అమ్మకాలు జోరందుకోవచ్చని, హై ఎండ్ సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ కొనసాగుతుందని అన్నారు. ఇదే సమయంలో టాబ్లెట్ల స్థానంలో ఫాబ్లెట్ల (స్మార్ట్ ఫోన్ కమ్ టాబ్లెట్) అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేశారు. 2015లో 8 నుంచి 9.9 అంగుళాల స్క్రీన్ తో లభిస్తున్న ఫాబ్లెట్ల అమ్మకాలు 39.2 శాతం పెరగడమే ఇందుకు ఉదాహరణగా కార్తీక్ అభివర్ణించారు.

More Telugu News