: 5000 మైళ్ల దూరం ప్రయాణించి... స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన పెంగ్విన్!

మనుషులతో పెంపుడు జంతువులకి, పక్షులకి విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఏదయినా జంతువు కానీ పక్షి కానీ మచ్చిక అయితే ఆ బంధం చిరకాలం నిలిచి ఉంటుంది. తాజాగా బ్రెజిల్ లో మనిషితో స్నేహం చేసిన పెంగ్విన్ అతనిని కలుసుకునేందుకు 5000 మైళ్ల దూరం ప్రయాణించి అతని ఇంటికి చేరుకుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళ్తే...బ్రెజిల్ కు చెందిన జావో పెరీరా (71) అప్పుడప్పుడు చేపల వేటకు వెళ్తుంటారు. 2011లో అలాగే ఓ సారి ఆయన చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో ఆయిల్ తెట్టులో కప్పబడి కొన ఊపిరితో ఇబ్బంది పడుతున్న పెంగ్విన్ ను ఆయన చూశారు. అయితే, దాని మానాన దానిని వదిలేయకుండా, తన ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేశారు. దానికి 'డిన్ డిమ్' అని పేరుపెట్టి అది కోలుకునేంత వరకు ఆయన జాగ్రత్తగా సంరక్షించారు. సపర్యలతో కోలుకున్న డిన్ డిమ్ ను ఆ తర్వాత ఆయన జాగ్రత్తగా సముద్రంలో వదిలిపెట్టారు. ఆ తరువాత ఏడునెలలకు డిన్ డిమ్ ఆయనను వెతుక్కుంటూ ఆయన ఇంటికి చేరుకుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన డిన్ డిమ్ ను చూసిన జావో ఆనందానికి అవధులు లేవు. డిన్ డిమ్ తనకు కొడుకుతో సమానమని ఆయన చెబుతున్నారు. తనతో స్నానం చేయించుకుని, తన ఒళ్లో కూర్చుని ఇష్టమైన ఆహారం తింటుందని జావో మురిసిపోతున్నారు. మాజెల్లానిక్ జాతికి చెందిన ఈ పెంగ్విన్ దక్షిణ అమెరికాలో ఉంటుంది. అయితే నాలుగు నెలలు తన వారితో కలిసి ఉండే డిన్ డిమ్, జావోను కలిసేందుకు 5000 మైళ్ల దూరం ప్రయాణిస్తుందని శాస్త్రకారులు చెబుతున్నారు. జావో తప్ప ఇంకెవరైనా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం డిన్ డిమ్ అస్సలు ఊరుకోదట, కొరికిపారేస్తుందని జావో చెబుతున్నారు.

More Telugu News