: ఎస్బీఐ స్పందన టూ లేట్!... గుడ్ విల్ తీసుకుని విమానమెక్కిన మాల్యా

బడా బాబులకు రుణాలివ్వడంలో వేగంగా చర్యలు చేపట్టే బ్యాంకులు... ఆ రుణాలను వసూలు చేసుకునే విషయంలో మాత్రం ఆలస్యంగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు మినహాయింపేమీ కాదు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ముందూ వెనుకా చూసుకోకుండా తాను రుణాలివ్వడమే కాక ఇతర బ్యాంకులతోనూ రుణాలిప్పించడంలో ఆ బ్యాంకు అమితాసక్తి చూపింది. అయితే రుణాల వసూలులో మాత్రం మొద్దు నిద్రలో జోగింది. ఎంచక్కా ఉన్న కంపెనీలను అమ్మేసుకుని విదేశాలకు వెళ్లిపోతున్నానని మాల్యా చెప్పేదాకా ఆ బ్యాంకు నిద్ర మత్తు వీడలేదు. డియాజియో నుంచి మాల్యాకు అందనున్న గుడ్ విల్ పై తనకే అధికారం దక్కేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ బ్యాంకు డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసేనాటికే అంతా అయిపోయిందట. ఒప్పందం మేరకు రూ.275 కోట్ల (40 మిలియన్ డాలర్లు)ను డియాజియో అప్పటికే మాల్యాకు చెల్లించేసింది. సదరు మొత్తం తన ఖాతాలో వేసుకున్న తర్వాతే మాల్యా దేశం విడిచి లండన్ చేరారు. ఇక మిగిలిన 35 మిలియన్ డాలర్లను డియాజియో ఇప్పటికిప్పుడేమీ చెల్లించడం లేదు. ఐదేళ్ల కాలపరిమితిలో ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ఆ సంస్థ మాల్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మాల్యాకు చేసిన చెల్లింపులను డియాజియో ప్రతినిధి ధ్రువీకరించారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి విడత మొత్తం రూ.275 కోట్లను మాల్యాకు చెల్లించామని డియాజియో అధికార ప్రతినిధి క్రిస్టీ కింగ్ నిన్న చెప్పారు. మాల్యాకు చెల్లింపులను నిలిపివేయాలన్న ట్రైబ్యునల్ ఆదేశాల విషయం తమకు తెలిసిందని, అయితే సదరు కోర్టు కాపీ తమకు ఇప్పటిదాకా అందలేదని కూడా ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు అందిన తర్వాత వాటిని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

More Telugu News