: మెరవని 'ఓరల్ బీ'... నిలిపివేయాలని పీఅండ్ జీ నిర్ణయం!

ఓరల్ బీ పేరిట టూత్ పేస్టును మార్కెటింగ్ చేస్తున్న ఎఫ్ఎంసీజీ అగ్రగామి ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్ జీ), మార్కెట్లో నెలకొన్న పోటీలో తట్టుకోలేక కుదేలవుతోంది. జూలై 2013లో ఓరల్ బీ టూత్ పేస్టు మార్కెట్లోకి రాగా, అప్పటి నుంచి లో-మార్జిన్ సెగ్మెంట్ ఉత్పత్తిగా, లాభాలను అందించలేని ప్రొడక్టుగానే ఇది నిలిచింది. మార్కెట్లో కోల్గేట్, క్లోజప్ వంటి పాతుకుపోయిన బ్రాండ్లతో పోటీ పడలేకపోవడం, మార్కెటింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టినా టూత్ పేస్టు మార్కెట్లో 1 శాతం వాటా మాత్రమే నమోదవుతుండటంతో 'ఓరల్ బీ'ని వదులుకోవాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం పాత స్టాక్ ను బయటకు పంపుతున్నామని, మరికొన్ని వారాల్లో టూత్ పేస్టు తయారీ, మార్కెటింగ్ ఆగిపోతుందని సంస్థ అధికారులు వెల్లడించారు. అయితే, అమ్మకాలు కొంతమేరకు సంతృప్తికరంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం దీన్ని కొనసాగిస్తామని మరో అధికారి వెల్లడించడం గమనార్హం. దాదాపు రూ. 7 వేల కోట్లున్న భారత ఓరల్ కేర్ మార్కెట్లో సుమారు 12 కంపెనీలతో పోటీ పడుతూ, కోల్గేట్ బ్రాండ్ 55 శాతం మార్కెట్ వాటాతో సుదీర్ఘకాలంగా నెంబర్ వన్ స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఇక నిన్నమొన్న వచ్చిన పతంజలి బ్రాండ్ టూత్ పేస్టు అప్పుడే 3 శాతం వాటాతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.

More Telugu News