: ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు... ఇక కఠిన చర్యలే: బ్యాంకులను హెచ్చరించిన ఆర్థిక శాఖ!

ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. దేశంలోనే ఫైనాన్షియల్ మార్కెట్లో 70 శాతం ప్రాతినిధ్యమున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వసూలు క్లిష్టతరం అవుతుండటం, పెద్ద పెద్ద కంపెనీలు వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొడుతుండటాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న ఆర్థిక శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల బాస్ లతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, మొండి బకాయిలు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. వీటిని వసూలు చేసేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని, వీటి వసూలు తరువాతనే బ్యాంకులకు మూలధన నిల్వలు పెరిగేందుకు సహకరిస్తామని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గడచిన డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐ తదితర బ్యాంకులు భారీ నష్టాలను ప్రకటించిన తరువాత, ఈక్విటీ మార్కెట్లో వాటి విలువ గణనీయంగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులకు హామీలిచ్చినట్టుగా రూ. 25 వేల కోట్ల విలువైన రీకేపిటలైజేషన్ ను కొంత ఆలస్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు పీఎస్యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను సైతం తగ్గించుకోవాలని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిన్హా స్పష్టం చేసినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.

More Telugu News