: 'ఫ్రీడమ్ 251'కు కట్టిన డబ్బులు ఈ వారంలో వెనక్కి: రింగింగ్ బెల్స్

కేవలం రూ. 251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ ఆర్భాటంగా ముందుకొచ్చిన వివాదాస్పద నోయిడా సంస్థ రింగింగ్ బెల్స్, 30 వేల మంది నుంచి వసూలు చేసిన ఆ డబ్బును మరో వారంలో వెనక్కి ఇస్తామని వెల్లడించింది. దాదాపు 76 లక్షల రూపాయలు తమ ఖాతాల్లో ఉన్నాయని, వాటిని ఫోన్ బుక్ చేసుకున్న కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి తిరిగి జమ చేయనున్నామని సంస్థ అధ్యక్షుడు అశోక్ ఛద్దా వివరించారు. తమ ఖాతాల్లోని డబ్బు సురక్షితంగా ఉందని ఆయన తెలిపారు. సీసీఏ అవెన్యూ, పేయూ బిజ్ పేమెంట్ గేట్ వేల ద్వారా డబ్బు వెనక్కు ఇస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఫోన్ బుకింగ్స్ ప్రారంభమైన తొలి రోజున 30 వేల మంది డబ్బు చెల్లించిన సంగతి తెలిసిందే. ఆపై దాదాపు 7 కోట్ల మంది ఫోన్ ను బుక్ చేసుకున్నారు. తమ ఫోన్లను సీఓడీ (క్యాష్ ఆన్ డెలివరీ) విధానంలో కస్టమర్లకు అందిస్తామని సంస్థ ఎండీ మోహిత్ గోయల్ తెలిపారు.

More Telugu News