: కొనుగోళ్ల వెంటే అమ్మకాలు... నష్టపోయిన మార్కెట్!

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందు ఉంచిన బడ్జెట్ ప్రతిపాదనలపై మార్కెట్ వర్గాలు మిశ్రమంగా స్పందించాయి. బడ్జెట్ ప్రసంగం మొదలయ్యేంత వరకూ క్రితం ముగింపునకు అటూఇటుగా కదలాడిన బెంచ్ మార్క్ సూచికలు ఆ తరువాత భారీ నష్టాల దిశగా సాగాయి. దీంతో మరో 'బ్లాక్ మండే' నమోదవుతుందని అందరూ భావించారు. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోయిన తరువాత, నల్లధనంపై జైట్లీ చేసిన వ్యాఖ్యలతో మార్కెట్లో కొత్త ఉత్సాహం కనిపించి కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దాదాపు 700 పాయింట్ల రికవరీ అనంతరం లాభాల స్వీకరణ జరగడంతో స్వల్ప నష్టాల్లో మార్కెట్ ముగిసింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 152.30 పాయింట్లు పడిపోయి 0.66 శాతం నష్టంతో 23,002.00 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 42.70 పాయింట్లు పడిపోయి 0.61 శాతం నష్టంతో 6,987.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.03 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.07 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 19 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ తదితర కంపెనీలు లాభపడగా, ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా, బీహెచ్ఈఎల్, మారుతి సుజుకి, లార్సెన్ అండ్ టూబ్రో తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,639 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,090 కంపెనీలు లాభాల్లోను, 1,391 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 86,34,614 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 85,90,869 కోట్లకు తగ్గింది.

More Telugu News