: చిలుక 'ముక్కు' తీరు మారింది!

చిలుక ముక్కు చూడ ముచ్చటగా ఎంతో అందంగా వుంటుంది. అందుకే, అది కవులకు కవితా వస్తువు కూడా అయింది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిలుక ముక్కు మాత్రం అందుకు భిన్నం. బ్రెజిల్ లోని సావోపాలో నగరంలోని ఒక ఎస్టేట్ లోని గిజి అనే ఈ చిలుక ముక్కు అసహజ రీతిలో పెరగడంతో, ఆ ఇబ్బందితో అది ఆహారం తీసుకోలేని స్థితికి చేరింది. ఈ విషయాన్ని గమనించిన యూనిమోంటో యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ రీసెర్చ్, స్క్రీనింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ బృందం చలించిపోయింది. ‘గిజి’కి శస్త్రచికిత్స చేసి దాని ముక్కును తొలగించి ఆ స్థానంలో ప్లాస్టిక్ ముక్కును పెట్టాలనుకున్నారు. అయితే, గట్టి పదార్థాలను, గింజలను తినేటప్పుడు ప్లాస్టిక్ ముక్కుతో సమస్యలు తలెత్తుతాయని గ్రహించి, మళ్లీ ఆలోచించి, చివరికి ప్లాస్టిక్ ముక్కుకు బదులుగా టిటానియం ముక్కును తయారు చేశారు. అందుకోసం సిసిరో మోరేయిస్ అనే 3డి డిజైనింగ్ సంస్థను వారు సంప్రదించారు. ఈ నెల 18న గిజికి శస్త్రచికిత్స చేసి టిటానియం ముక్కును అమర్చారు. దీనిని అమర్చేందుకు రంగురంగుల స్క్రూలను వైద్యులు వినియోగించారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న గిజి ఇప్పుడు చక్కగా తింటోంది. కాకపోతే, గిజి తన ఆహారాన్ని తాను సంపాదించుకోలేదు. అందుకే, ఏదైనా జంతు ప్రదర్శన శాలకు గిజిని అప్పగించాలని వైద్యులు భావిస్తున్నారు. ఒక పక్షికి అవయవ మార్పిడి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని సమాచారం. కాగా, గిజి ముక్కు మార్పిడికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మూగజీవి కోసం ఇంతగా పాటుపడిన వైద్యులను, డిజైనింగ్ సంస్థను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

More Telugu News