ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుతోంది నల్లడబ్బే... సవివరంగా వివరించిన ఆర్థికవేత్త కౌశిక్ బసు!

Mon, Feb 22, 2016, 01:35 PM
ఈ భూమిపై శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత్ నమోదు చేసిన 7.4 శాతం వృద్ధి, అన్ని అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఎక్కువే. ఇదే సమయంలో భారత్ విజయం వెనుక ఓ 'నీలినీడల కోణం' ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్, భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు కౌశిక్ బసూ అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ కుప్పకూలినప్పటికీ, ఇండియా తట్టుకుని నిలబడిన కారణాలను తన తాజా పుస్తకం 'యాన్ ఎకానమిస్ట్ ఇన్ ది రియల్ వరల్డ్-ఎకనామిక్స్ ఈజ్ నాట్ ఏ మోరల్ సబ్జెక్ట్'లో వివరించారు. ఆదాయపు శాఖ కన్నుగప్పి దాచిన నల్లధనమే బ్యాంకింగ్ సెక్టారును కాపాడిందన్నది ఆయన వాదన.

అదెలాగంటే... 2008కి పూర్వం, వరుసగా మూడు సంవత్సరాల్లో ఇండియా 9 శాతానికి మించిన వృద్ధిని నమోదు చేసింది. ఇందులో అత్యధిక భాగం నిర్మాణ రంగంలో పెరిగిన డిమాండే అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 2002 నుంచి 2006 వరకూ గృహాల ధరలు సాలీనా 16 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయి. సరాసరి ఆదాయం పెరిగిన తీరు కన్నా ఇది ఎంతో అధికం. అంతేకాదు, అమెరికాలో నిర్మాణ రంగ వృద్ధితో పోల్చినా అధికమే. హేతుబద్ధత లేని ఈ పెరుగుదలే ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి ఇండియాను బయటపడేసింది. ఎన్నో దేశాల్లో బ్యాంకులు సబ్ ప్రైమ్ (ఇంటికి రుణమిచ్చి, ఆపై దాని విలువ పడిపోవడంతో, నెలసరి కిస్తీలు వసూలు కాక బ్యాంకులకు ఏర్పడిన నష్టం) సునామీలో చిక్కుకు పోగా, ఇండియాలో ఆ పరిస్థితి ఏర్పడలేదు.

ఎందుకంటే, ఆర్బీఐ తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు అన్న సమాధానం వినిపిస్తుంది. కానీ, అసలు విషయం ఇండియాలో దాగున్న నల్లధనం. ఐటీ శాఖకు చిక్కకుండా ప్రజలు దాచుకున్న డబ్బు. ఆ సమయంలో భారత నిర్మాణ రంగంలో అత్యధిక గృహాల కొనుగోళ్లు నగదు చెల్లింపుల ద్వారానే జరిగాయి. ఇండియాలో రూ. 1000 నోటు అందుబాటులో ఉండటంతో, ఓ చిన్న సూట్ కేసులో తీసుకెళ్లిన మొత్తంతో కూడా మంచి ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇంకాస్త లోతుగా వెళితే... ఉదాహరణకు ఒక ఇల్లు అమ్మకానికి ఉండగా, అది మీకు నచ్చి కొనుగోలు చేయాలని భావించారనుకోండి. అమ్మకందారు దాని ధరను రూ. 100గా చెప్పి, తాను రూ. 50 మాత్రమే అధికారికంగా తీసుకుంటాను, మిగిలినది బ్లాక్ మనీ రూపంలో కావాలని అడుగుతాడు. ఆ ఇంటిని తొలుత తీసుకున్న రూ. 50కే విక్రయించినట్టు చెబుతాడు. మిగిలిన రూ. 50 నల్లధనం. దీనివల్ల అటు కొనుగోలుదారుకు, ఇటు అమ్మకందారుకు లాభం. అమ్మిన వ్యక్తి భారీగా మూలధన లాభంపై చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టవచ్చు.

కొనుక్కున్న వ్యక్తికి సైతం ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఖర్చులూ తగ్గుతాయి. ఒకవేళ బ్యాంకు రుణం తీసుకున్నా అధికారికంగా చెల్లించిన రూ. 50 లలో 80 శాతంగా అంటే రూ. 40 మాత్రమే రుణం రూపంలో లభిస్తుంది. అంటే ఆస్తి వాస్తవ విలువతో పోలిస్తే రుణం మొత్తం చాలా తక్కువ. అంటే ఎంత సమస్య ఎదురైనా సదరు రుణ గ్రహీత, నెలసరి కిస్తీలను చెల్లించడం ఆపడు. ఇదే ఇండియాకు వరమైందన్నది కౌశిక్ బసు వెల్లడించిన 'పచ్చి నిజం'.

ఇక అగ్రరాజ్యాల విషయానికి వస్తే, నిర్మాణ రంగంలో డిమాండ్ గరిష్ఠ స్థాయిలో ఉన్న వేళ, 100 శాతం వరకూ యూఎస్, యూకే బ్యాంకులు రుణాలిచ్చాయి. కొన్ని బ్యాంకులు ఫర్నీచర్ కొనుగోలుకు అంటూ 110 శాతం రుణాలను కూడా ఇచ్చాయి. అందువల్లే ఆ బ్యాంకులు, నిర్మాణ రంగం కుదేలుతో కుప్ప కూలగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ తట్టుకొని నిలిచింది.
అంతమాత్రాన లంచగొండి, అవినీతికి తాను మద్దతిస్తున్నట్టు కాదని వ్యవస్థ తీరును మాత్రమే ప్రస్తావించానని ఈ పుస్తకంలో కౌశిక్ బసు వ్యాఖ్యానించారు.
X

Feedback Form

Your IP address: 54.161.77.48
Articles (Latest)
Articles (Education)