: అదొక్కటే బ్యాంకు కాదు!...తనను డిఫాల్టర్ గా ప్రకటించిన పీఎన్ బీపై మాల్యా ఘాటు వ్యాఖ్య

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ)... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అప్పులివ్వడమే తప్పైనట్టుంది. తన వద్ద తీసుకున్న రుణాన్ని చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్న మాల్యాను ఆ బ్యాంకు ఎట్టకేలకు మొన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్ ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించింది. దీనిపై నిన్న ఢిల్లీ వెళ్లిన మాల్యాను మీడియా చుట్టుముట్టింది. ‘‘పీఎన్ బీ మిమ్మల్ని విల్ ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించింది కదా... దీనిపై మీ స్పందన ఏమిటి?’’ అని ప్రశ్నించింది. దీనికి సమాధానం దాటవేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు మాల్యా చేసిన యత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో మాల్యా పీఎన్ బీతో పాటు తనను నిలదీసిన మీడియాపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పీఎన్ బీ ఒక్కటే బ్యాంకు కాదు. దేశంలో చాలా బ్యాంకులున్నాయి. అయినా నేనేం చేయాలనుకుంటున్నానో, అదే చేస్తా. రుణాలన్నీ చెల్లించేందుకు యత్నిస్తున్నాను. గుచ్చి గుచ్చి ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు ఆర్బీఐ గవర్నర్లేమీ కాదు, ప్రభుత్వ ప్రతినిధులు అంతకన్నా కాదు’’ అంటూ ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News