: 'విన్నపాలు వినవలె'... ఆర్థికమంత్రి ముందు వేతన జీవుల కోరికల చిట్టా!

పన్ను పరిధిలో ఉండే వేతన జీవులు... ప్రభుత్వానికి పాలిచ్చే ఆవుల్లాంటి వాళ్లు. ఖజానాకు నిధులను సమకూర్చుకోవాలని భావించినప్పుడల్లా పన్నుల భారం మోపితే, అది అత్యధికంగా ప్రభావం చూపేది ఉద్యోగస్తులపైనే. వీరికి వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్ మాదిరిగా పన్ను రాయితీలను పొందే అవకాశాలు, రిటర్న్ క్లయిములు తక్కువ. యాజమాన్యాలే టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) మినహాయించుకుని వీరికి వేతనాలు ఇస్తుంటాయి. ఎటొచ్చీ వీరికి కలిగే లాభం ఏంటంటే పన్ను పరిధులు పెంచడం మాత్రమే. ఈ నేపథ్యంలో వేతన జీవి తన జేబులో కొంత డబ్బు మిగిలేలా రానున్న బడ్జెట్లో రాయితీలు ఇవ్వాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి విన్నవిస్తున్నాడు. కనీసం పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డబ్బు పొదుపు చేసుకోగలిగేలా ఉంటే, అదే పదివేలన్నది అత్యధికుల అభిప్రాయం. ఉదాహరణకు 1997-98లో ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ రూ. 800 వద్ద ఉండగా, అది మెల్లిగా పెరుగుతూ, గత సంవత్సరం రూ. 1600కు చేరింది. వాస్తవ ద్రవ్యోల్బణం చూపిన ప్రభావాన్ని పరిశీలిస్తే ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ కనీసం నెలకు రూ. 2,600 ఉండాలి. అంటే 1997-98లో పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే ఇప్పటి పన్ను చెల్లింపుదారులు అదనంగా రూ. 1000 ఖజానాకు చెల్లిస్తున్నట్టు. ప్రతియేటా రూ. 1.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ (పీపీఎఫ్, ఎన్ఎస్సీ, గృహ రుణాలు తదితరాలు) కింద ఆదా చేసుకోవచ్చు. 2005-06 నుంచి 2014-15 వరకూ ఈ మొత్తం రూ. 1 లక్ష వరకే ఉండేది. ఇక 2005 నుంచి ద్రవ్యోల్బణం మార్పులను పరిగణనలోకి తీసుకుంటే 2016-17లో పన్ను రాయితీలు కనీసం రూ. 2.17 లక్షల వరకూ ఉండాలి. ఈ సంవత్సరం పన్ను రాయితీల పరిధిని కనీసం రూ. 2 లక్షలకు చేయాలన్నది ఉద్యోగుల కోరిక. ఇక మెడికల్ రీయింబర్స్ మెంట్ విషయానికి వస్తే, గత పదేళ్లలో ఇన్ ఫ్లేషన్ పరిశీలిస్తే రూ. 50 వేలుగా ఉండాల్సింది ప్రస్తుతం రూ. 15 వేలుగా మాత్రమే ఉంది. దీన్ని కూడా సాధ్యమైనంతగా సవరించాలన్న ఒత్తిడి అరుణ్ జైట్లీపై ఉంది. పెరిగే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వేతన జీవులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలన్నది అందరి కోరిక.

More Telugu News