: మెరిసిన స్టాక్ మార్కెట్, బుల్ హైజంప్!

ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్స్ రంగంలోని కంపెనీల ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు ప్రయత్నించడం, షార్ట్ కవరింగ్ పెద్దఎత్తున జరగడంతో భారత స్టాక్ మార్కెట్ బుల్ హైజంప్ చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ ఎఫ్ఐఐల సెంటిమెంట్ ను పెంచిందని, ద్రవ్యోల్బణం తగ్గిందన్న గణాంకాలు ఈక్విటీలకు మద్దతుగా నిలిచాయని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. నిఫ్టీ సూచికకు అత్యంత కీలకమైన 7,150 పాయింట్లపైన కొనుగోలు మద్దతు కనిపించింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 150 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, ఆపై మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 2.50 లక్షల కోట్లకు పైగా పెరిగింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 568 పాయింట్లు పెరిగి 2.47 శాతం లాభంతో 23,554.12 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 182 పాయింట్లు పెరిగి 2.61 శాతం లాభంతో 7,162.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 3.47 శాతం, స్మాల్ క్యాప్ 3.35 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 45 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, వీఈడీఎల్, టాటా స్టీల్, హిందాల్కో, ఎల్అండ్ టీ తదితర కంపెనీలు లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, ఐడియా, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,776 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,993 కంపెనీలు లాభాల్లోను, 668 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. శుక్రవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 86,09,586 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 88,63,667 కోట్లకు పెరిగింది.

More Telugu News