: పడుతున్న కత్తి ఇది... పట్టుకుంటే గాయమైనా కావచ్చు, ఆయుధమైనా దొరకచ్చు...ఇది మన స్టాక్ మార్కెట్ పరిస్థితి!

పైనుంచి వేగంగా కిందకు పడుతున్న కత్తి. పట్టుకుంటే... చేతికి గాయమైనా కావచ్చు, లేకుంటే ఆయుధమైనా దొరకవచ్చు. భారత మార్కెట్ ప్రస్తుత పరిస్థితికి ఈ ఉపమానం సరిగ్గా అద్దంపట్టేలా ఉంది. గడచిన 12 నెలల్లో భారత మార్కెట్ 20 శాతం పతనం కాగా, టాప్ 100 కంపెనీల్లో 11 కంపెనీలు 50 శాతానికి పైగా పడిపోయాయి. వీటిని నమ్ముకున్న ఇన్వెస్టర్లు తమ సంపదలో సగం కోల్పోయారు. ఎస్అండ్ పీ బీఎస్ఈ 100 ఇండెక్స్ లోని లార్జ్ కాప్ కంపెనీలుగా ఉన్న వేదాంత రిసోర్సెస్ (70 శాతం), హిందాల్కో (57 శాతం), ఆదిత్య బిర్లా నువో (56 శాతం), కెయిర్న్ ఇండియా (54 శాతం) పంజాబ్ నేషనల్ బ్యాంక్, (54 శాతం), టాటా మోటార్స్, సెయిల్ (50 శాతం) తీవ్రంగా నష్టపోయాయి. కాస్తంత చిన్న కంపెనీల్లో సెసా గోవా (70 శాతం), బ్యాంక్ ఆఫ్ ఇండియా (64 శాతం), జేఎస్పీఎల్ (63 శాతం), కెనరా బ్యాంక్ (57 శాతం) నష్టపోయాయి. గత శుక్రవారం నాటి సెషన్లో, సైకలాజికల్ గా సెన్సెక్స్ కు 23 వేల పాయింట్ల స్థాయి వద్ద కొనుగోలు మద్దతు కనిపించింది. అంతమాత్రాన తిరిగి మార్కెట్ పెరుగుతుందని భావించే వీల్లేదన్నది అత్యధిక రీసెర్చ్ సంస్థల అభిప్రాయం. రెండు నెలల నుంచి బేర్ల చేతుల్లోకి వెళ్లిపోయిన సూచికలు, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరింతగా పతనం అవుతాయని అంచనా. ఇక ఈ సమయంలో 50 శాతానికి పైగా నష్టపోయిన బ్లూ చిప్ కంపెనీల్లో ఈక్విటీలను కొనుగోలు చేయవచ్చా? ఇది అత్యధిక ఇన్వెస్టర్లలో ఉదయిస్తున్న ప్రశ్న. వేగంగా నష్టపోతున్న మార్కెట్లో అంతకన్నా వేగంగా పడుతున్న ఓ సంస్థ ఈక్విటీ పైనుంచి పడిపోతున్న కత్తి వంటిదన్నది మార్కెట్ సామెత. దీన్ని అందుకోవాలని ప్రయత్నిస్తే ఎక్కవ శాతం గాయమయ్యే అవకాశాలే ఉంటాయి. "ప్రస్తుతానికి ఏ విధమైన బెట్టింగ్ చేయక పోవడమే ఉత్తమం. 2008 నాటి పరిస్థితి మరోసారి కనిపిస్తోంది. ఇదే సమయంలో మరీ ఎక్కువగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. వేచి చూసే ధోరణిలో ఉంటే, ఒకసారి కుదుటపడ్డాక, మిగతా మార్కెట్లకన్నా సెన్సెక్స్, నిఫ్టీలు వేగంగా పెరుగుతాయి" అని బీఎస్ఈ మెంబర్ జగదీష్ మల్కానీ ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. క్రూడాయిల్ పతనం చైనాలో నెలకొన్న మాంద్యం తదితరాల కారణంగానే మార్కెట్లు నష్టాల దారిలో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. "గతవారంలో మార్కెట్ పతనం పరిశీలిస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. 2013లోనూ ఇదే తరహా భయాలు వ్యక్తమయ్యాయి. కానీ మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. ఎంత మొత్తం డబ్బు హరించుకుపోతే, అంతే మొత్తం సంపాదించుకునేందుకు అవకాశాలు దగ్గరవుతాయి" అని కోటక్ ఏఎంసీ నిపుణుడు నీలేష్ షా వివరించారు. సమయం కోసం వేచి చూడటం తప్ప మరో మార్గం కనిపించడం లేదని, ఇన్వెస్టర్లు తమ నిధులను బులియన్, ఫిక్సెడ్ డిపాజిట్ల వైపు మళ్లించవచ్చని సలహా ఇచ్చారు.

More Telugu News