: మన బ్యాంకులు దారికి రావాలంటే 'బ్యాండ్ ఎయిడ్' చాలదు... సర్జరీ చేయాల్సిందే: రాజన్

భారత బ్యాంకింగ్ వ్యవస్థను కుదేలు చేస్తున్న 'బ్యాడ్స్ లోన్స్' సమస్య తొలగాలంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాల్సి వుందన్నారు. ముంబైలో జరిగిన బ్యాంకర్ల సదస్సులో పాల్గొన్న ఆయన "నిరర్థక ఆస్తుల శాతం తగ్గి, చెడు రుణాలను రూపుమాపాలంటే చిన్న గాయానికి వేసే బ్యాండ్ ఎయిడ్ చాలదు. ఓ పెద్ద శస్త్ర చికిత్స చేయాల్సిందే" అన్నారు. ఇదే సమయంలో ఎప్పుడో ఇచ్చిన రుణాలను కొన్ని రద్దు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చని తెలిపారు. ఇక వసూలుకావని భావించే రుణాల మొత్తాన్ని దస్త్రాల్లోంచి తొలగిస్తే, బ్యాంకులపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, గడచిన డిసెంబర్ త్రైమాసికంలో చెడు రుణాల మొత్తం పెరిగిన కారణంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 62 శాతం తగ్గింది. ఈ బ్యాంకులో రూ. 1,506 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇటువంటి కారణాల చేతనే బ్యాంకులు నష్టాల్లో నడుస్తున్నాయని, వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సి వుందని రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, బ్యాంకుల్లో లోపాలు ఎన్పీయే (నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్) కారణంగానే ఈక్విటీలకు నష్టాలు వస్తున్నాయని భావించలేమని, అంతర్జాతీయ పరిస్థితులూ ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు.

More Telugu News