: 'మోదీ పూర్వం' నాటికి స్టాక్ మార్కెట్... ఇన్వెస్టర్లకు పట్టపగలే చుక్కలు!

భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పట్టపగలే చుక్కలు కనిపించి కళ్లు బైర్లు కమ్మాయి. ఎటుచూసినా అమ్మకాల ఒత్తిడి. దీనికితోడు, మార్కెట్ మరింతగా పడిపోవచ్చన్న ఆలోచనలతో షార్ట్ సెల్లింగ్... వెరసి బెంచ్ మార్క్ సూచికలు నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందున్న స్థాయికి పడిపోయాయి. మే 12, 2014 తరువాత నిఫ్టీ సూచిక తొలిసారిగా 7 వేల పాయింట్ల కిందకు దిగివచ్చింది. లిస్టెడ్ కంపెనీల్లో 95 శాతానికి పైగా నష్టాల్లో మిగలగా, మిగిలినవి నామమాత్రంగా లాభపడ్డాయి. నమ్ముకున్న ఇన్వెస్టర్లకు చెందిన సుమారు రూ. 3.18 లక్షల కోట్ల సంపద పతన ప్రభంజనంలో కొట్టుకుపోయింది. అంటే మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 18 నెలల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి అంతా ఒక్క రూపాయి కూడా ఆదాయాన్ని తెచ్చి పెట్టనట్టే. ఇక మార్కెట్ గరిష్ఠ స్థాయిలో అంటే నిఫ్టీ 9 వేలు, సెన్సెక్స్ 30 వేల పాయింట్లను దాటిన సమయంలో పెట్టిన పెట్టుబడి లాభాలను ఇవ్వలేదు సరికదా, 20 శాతం వరకూ నష్టాన్ని మిగిల్చినట్టే చెప్పుకోవాలి. కాగా, గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 807.07 పాయింట్లు పడిపోయి 3.40 శాతం నష్టంతో 22,951.83 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 239.35 పాయింట్లు పడిపోయి 3.32 శాతం నష్టంతో 6,976.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 3.27 శాతం, స్మాల్ క్యాప్ 4.64 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 3 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. సిప్లా, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభపడగా, వీఈడీఎల్, టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, హిందాల్కో, టాటా పవర్, ఎంఅండ్ఎం, పవర్ గ్రిడ్ తదితర కంపెనీల ఈక్విటీలు 4.7 శాతం నుంచి 7.4 శాతం మేరకు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,779 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 324 కంపెనీలు లాభాల్లోను, 2,359 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బుధవారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 89,55,889 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 86,34,913 కోట్లకు పడిపోయింది. నిఫ్టీ సూచికకు తదుపరి 6,930 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని, అక్కడా నిలువకుంటే 6,700 పాయింట్ల వరకూ తక్షణ పతనం తప్పదని నిపుణులు హెచ్చరించారు.

More Telugu News