: ఇన్వెస్టర్లకు బ్లాక్ థర్స్ డే, హరించుకుపోయిన రూ. 3 లక్షల కోట్లు!

భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చే స్థాయికి పడిపోయింది. ఇటీవలి కాలంలో తిరిగి ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవన్నట్టు దిగజారుతూ వస్తున్న బెంచ్ మార్క్ సూచికలు గురువారం నాడు ఏకంగా 3 శాతానికి పైగా దిగజారాయి. మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 720 పాయింట్ల పతనంతో 23,036 పాయింట్ల వద్దా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 221 పాయింట్ల పతనంతో 6,994 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. బుధవారం నాటి ముగింపు సమయానికి రూ. 89,55,889 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 3 లక్షల కోట్లకు పైగా పడిపోయి రూ. 86,45,235 కోట్లకు తగ్గిపోయింది. ఎన్ఎస్ఈ-50లో ఐడియా, సిప్లా మినహా మిగతా 48 కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. బీఎస్ఈలో మిడ్ కాప్ 3.2 శాతం, స్మాల్ కాప్ 4.5 శాతం పడిపోయాయి. భారత మార్కెట్ కు ఈ సంవత్సరం ఇదే అతిపెద్ద పతనం కాగా, ఇన్వెస్టర్లకు బ్లాక్ థర్స్ డేగా చరిత్రలో మిగిలిపోనుంది.

More Telugu News