: ఇదే నా చివరి తెలుగు సినిమా...ఇకపై తెలుగులో సినిమాలు చేయను: రాంగోపాల్ వర్మ ప్రకటన

ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగు సినిమాల నుంచి తప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు. తెలుగులో తాను తీసే చివరి సినిమా 'వంగవీటి' అని స్పష్టం చేశారు. విజయవాడలో కులాల కుంపట్లు రగిల్చిన చరిత్రపై 'వంగవీటి' సినిమా తీస్తున్నానని చెప్పిన ఆయన, ఇదే తెలుగులో తన చివరి చిత్రమని వెల్లడించారు. కాగా, తాను రూపొందించిన 'గోవిందా గోవిందా' సినిమా విషయంలో సెన్సార్ వారితో తలెత్తిన వివాదం కారణంగా, ఇకపై తెలుగులో సినిమాలు చేయనని ప్రకటించి, ముంబై వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత హిందీలో 'రంగీలా', 'సత్య', 'కంపెనీ', 'సర్కార్' వంటి సంచలనాత్మక సినిమాలు తీసి, విజయం సాధించారు. తెలుగులో ఇక దర్శకత్వం చేయనని చెప్పిన ఆయన ఈమధ్యలో మళ్లీ 'అనగనగా ఒకరోజు' చిత్రాన్ని చేశారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా, ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆయన తెలుగు సినిమాలే చేస్తున్నారు. వాటిల్లో 'రక్తచరిత్ర', 'కిల్లింగ్ వీరప్పన్' సినిమాలు అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా, తన చివరి చిత్రం 'వంగవీటి' అని వర్మ ప్రకటించిన నేపథ్యంలో, ఈసారి ఆయన తన మాటకు కట్టుబడి తెలుగులో ఇక సినిమాలు తీయడం మానేస్తారా? అనేది చూడాలి!

More Telugu News