: పరుగు మొదలు పెట్టిన బంగారం... త్వరలో రూ. 50 వేలకు!

సమీప భవిష్యత్తులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు 50 వేల రూపాయలను తాకుతుందా? అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోందని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 9 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న బంగారం ధరలు మరోసారి కనిష్ఠాలకు చేరే అవకాశాలు లేవని, స్టాక్ మార్కెట్ల పతనం, ముడిచమురు ఉత్పత్తి తగ్గకపోవడం, చైనాలో నెలకొన్న మాంద్యం, ఉగ్రవాద భయాలు తదితర కారణాలు స్టాక్ మార్కెట్లతో పోలిస్తే బులియన్ మార్కెట్ ను ఆకర్షణీయం చేశాయని, దీని ఫలితంగా త్వరలోనే బంగారం ధర రెట్టింపు కావచ్చని అంచనా వేస్తున్నట్టు బులియన్ నిపుణుడు సుశీల్ కేడియా వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో అక్టోబరు తరువాత ఔన్సు బంగారం ధర 1,174 డాలర్లను దాటగా, ఇండియాలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 27,700ను అధిగమించిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో బంగారం ధర 1,030 నుంచి 1,040 డాలర్ల మధ్య మంచి కొనుగోలు మద్దతును కూడగట్టుకుంది. ఈ నేపథ్యంలో బంగారం పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారని, అనుకున్న దానికన్నా వేగంగా ధరలు పెరగవచ్చని కేడియా అంచనా వేశారు. ఇండియాలో డాలర్ తో రూపాయి మారకపు విలువ వేగంగా పడిపోవడం ప్రభావం చూపనుందని దేశవాళీ బ్రోకరేజి సంస్థ ఐఐఎఫ్ఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ అభిప్రాయపడ్డారు. జనవరి నుంచి బంగారం ధరలు పెరుగుతాయన్న తమ అంచనాలు నిజమవుతున్నాయని, ఈ దశలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బంగారం అత్యుత్తమమని సలహా ఇచ్చారు.

More Telugu News