: హోండా నుంచి మినీ బైక్ 'నవీ'... ధర రూ. 39,500 మాత్రమే!

న్యూఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 13వ ఆటో ఎక్స్ పోలో ఎన్నో కొత్త వాహనాలు తొలిసారిగా ప్రజల ముందుకు రాగా, మరెన్నో వాహనాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. మొత్తం 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వందలాది కంపెనీలు తమ వాహనాలను, విడిభాగాలను, అధునాతన సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఇక జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న హోండా విడుదల చేసిన 'నవీ మినీ' బైక్ తొలిరోజు ఆకర్షణగా నిలిచింది. దీన్ని ఆవిష్కరించిన హోండా సంస్థ ప్రతినిధులు భారత మార్కెట్లో దీని ధర రూ. 39,500 రూపాయలని తెలిపారు. 100 సీసీ ఇంజన్ హెచ్ఈటీ ఇంజన్ తో, గంటకు 81 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకునే బైకును పట్టణ ప్రాంతాల్లోని యువత లక్ష్యంగా తయారు చేసినట్టు హోండా ప్రకటించింది. 7.83 బీహెచ్పీ సామర్థ్యంతో నిమిషానికి 7000 ఆర్పీఎంను బైక్ అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, ఇంత తక్కువ ధర సెగ్మెంట్ లోకి హోండా ప్రవేశిస్తుందని భావించలేదని వాహన రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ బైక్ భారత టూవీలర్ పరిశ్రమను ఓ కుదుపు కుదపవచ్చని అంచనా. ఇదిలావుండగా, తొలి రోజు ఆవిష్కరణల్లో సుజుకీ జిక్సర్, యాక్సెస్ 125 అప్ డేటెడ్ ఎడిషన్ బైక్లు, డీఎస్కే బెన్నలల్లీ ఆవిష్కరించిన టోర్నడో 300, టీఆర్కే 502, యమహా రే జడ్ ఆర్, ఇసుజు డీ-మ్యాక్స్, హ్యుందాయ్ టుక్సన్ తదితర వాహనాల సందడి పెవీలియన్ల వద్ద అధికంగా కనిపిస్తోంది.

More Telugu News