: అత్యంత ప్రమాదకర వైరస్ ను గుర్తుకు తెస్తున్న టాటాలు... అంతర్మథనం!

ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్... 'జికా'! ఈ వైరస్ రోజురోజుకూ బలపడుతూ, దేశాల సరిహద్దులు దాటి మరీ విస్తరిస్తుంటే, డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ అత్యవసర వైద్య స్థితిని కూడా ప్రకటించింది. ఇక ఆ వైరస్ కు, టాటా మోటార్స్ కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? టాటా మోటార్స్, తామందిస్తున్న హ్యాచ్ బ్యాక్ కు 'జికా' అనే పేరు పెట్టింది. స్పెల్లింగ్ లో తేడా ఉన్నప్పటికీ, రెండు పదాలూ 'జికా' అన్న పేరుతోనే ఉండటంతో, ఈ కారు పేరును మార్చాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు మంగళవారం నాడు వెల్లడించారు. ఇటీవలి కాలంలో సంస్థ చిన్న కారు 'జికా'ను భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బార్సిలోనా ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో చేసుకున్న బ్రాండింగ్ ఒప్పందంలో భాగంగా, ప్రచారం నిమిత్తం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వేళ, దోమ కాటుతో వ్యాపిస్తూ, గర్భస్థ శిశువులకు ప్రాణాంతకంగా మారిన జికా వైరస్ విజృంభించిన సంగతి తెలిసిందే. జికా పేరు కలవడంతో కారు అమ్మకాలు విదేశాల్లో అంతంతమాత్రంగా సాగుతుండటంతో పరిస్థితిని అంచనా వేస్తున్నామని టాటా మోటార్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ మినారీ షా వెల్లడించారు. అయితే, పేరు మార్పు విషయమై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని ఢిల్లీలో ప్రారంభం కానున్న 'ఆటో ఎక్స్ పో 2016' సందర్భంగా వ్యాఖ్యానించారు

More Telugu News