: ప్రజారంజక బడ్జెట్ ఇవ్వలేను: బాంబేసిన ఆర్థికమంత్రి

వచ్చే నెల 29న పార్లమెంటు ముందుకు రానున్న 2016-17 వార్షిక బడ్జెట్ లో పలు రాయితీలు ఉంటాయని ఆశ పడుతున్న సగటు చిరుద్యోగి, పన్ను చెల్లింపుదారులకు ఈ వార్త కొంత ఆందోళనను కలిగించేదే. ఈ దఫా బడ్జెట్ ప్రజారంజకంగా ఉండబోదన్న సంకేతాలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెలిబుచ్చారు. ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్య లోటు పెరిగిన కారణాలతో బడ్జెట్ లో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పక పోవచ్చని న్యూఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో ఆయన తెలిపారు. బడ్జెట్ తయారీ సాగుతోందని, అన్ని వర్గాలతో తాను చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించిన ఆయన, ప్రతి ఒక్కరికీ కోరికలుంటాయని, అన్నింటినీ ఒకేసారి తీర్చలేమని అన్నారు. వృద్ధి బాట దారితప్పుతోందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే జైట్లీ ఇలా మాట్లాడటం గమనార్హం. మరోవైపు ద్రవ్యలోటు కారణంగా సంక్షేమ పథకాల అమలుకు విఘాతం కలుగుతోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తన అభిప్రాయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు భారీ పన్ను వడ్డనలకు సూచనగా భావించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతంగా ఉన్న లోటును 3.5 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంతో బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలి మధ్యంతర సమీక్షలో సైతం చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సంక్షేమానికి నిధులు తగ్గిస్తేనే, వృద్ధి పెరుగుతుందని ఆయన వివరించారు. ఒక సంవత్సరం లక్ష్యాన్ని చేరుకోలేక సర్దుకుపోతే, పదే పదే అలాగే చేయవలసి వస్తుందని బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న జైట్లీ వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News